ఆర్టీసీ బస్సు, కారు ఢీ
చింతకాని: మండలంలోని తిరుమలాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో మధిర పట్టణానికి చెందిన పసుపులేటి వెంకటసాయి అలియాస్ బ్రహ్మయ్య (28) మృతి చెందగా వేపూరి శబరీశ్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. బోనకల్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు, ఖమ్మం నుంచి బోనకల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిరుమలాపురం క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ఢీకొన్నాయి. కారు డ్రైవింగ్ చేస్తున్న బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న శబరీశ్‌కు గాయాలయ్యాయి. ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని స్థానికుల సాయంతో బయటకు తీసి, ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న సమయంలో బ్రహ్మయ్య మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. మృతుడి స్వగ్రామం ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు కాగా, తల్లిదండ్రులు మధిరలో నివాసం ఉంటున్నారు. బ్రహ్మయ్య, శబరీశ్ ఎర్రవరంలోని ఆలయ దర్శనానికి వెళ్లి ఖమ్మం వస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, బస్సు పక్కకు దూసుకుపోయి రాయికి గుద్దుకుని ఆగింది. ఆ పక్కనే వ్యవసాయ బావి ఉంది. బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయికి తగలకపోతే బస్సు బావిలో పడేదని ప్రయాణికులు తెలిపారు.
ఒకరు మృతి
ఆర్టీసీ బస్సు, కారు ఢీ


