పరిహారం ఇప్పించాలని మొక్కజొన్న రైతుల వినతి
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్న పంట సాగు చేసిన తాము నష్టపోయినా విత్తన కంపెనీ ప్రతినిధులు పరిహారం చెల్లించడం లేదని జిల్లాలోని పలు మండలాల రైతులు వాపోయారు. ఈ సందర్భంగా వారు సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వినతిపత్రం అందజేశారు. కొణిజర్ల మండలం రామనర్సయ్యనగర్ గ్రామ రైతులు సాగు చేసిన పంటకు రూ.కోటి మేర నగదు చెల్లించాల్సి ఉందని, వేంసూరు మండలంలో దిగుబడి రానందున పరిహారం ఇప్పించాలని కోరారు. అంతేకాక ప్రైవేట్ సీడ్ కంపెనీలు, దళారులపైనా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. బీకేఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పగడవరపు శ్రీనివాసరావు, తాళ్లూరి శ్రీనివాసరావు, నాయకులు తూము అప్పారావు, కొండపర్తి నరేశ్, రైతులు పాల్గొన్నారు.


