అధికారుల చోద్యం! | - | Sakshi
Sakshi News home page

అధికారుల చోద్యం!

Jan 13 2025 12:17 AM | Updated on Jan 13 2025 12:17 AM

అధికా

అధికారుల చోద్యం!

నకిలీ వైద్యం..

ఖమ్మంవైద్యవిభాగం: వైద్యం వికటించి మృతి చెందితే ఆందోళన చేపట్టడం, కొందరు యాజమాన్యంతో చర్చలు జరిపి వారు ముట్టజెప్పింది తీసుకోవడం జరుగుతుందే తప్ప నకిలీ వైద్యంపై మాత్రం ఉక్కుపాదం మోపలేకపోతున్నారు. చాన్నాళ్లుగా నగరంలో కేరళ వైద్యం, హెర్చల్‌ క్ల్లినిక్‌, ఆక్యూ పంక్చర్‌, ఫిస్టులా తదితర పేర్లతో కొందరు నకిలీ వైద్యులు పలు ప్రాంతాల్లో అద్దెకు ఉంటూ బోర్డులు పెట్టకుండా నకిలీ వైద్యం దందాకు తెరలేపుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో నకిలీ క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఫిర్యాదులు అందినప్పుడు నామమాత్రపు దాడులు నిర్వహించి హడావిడి చేయడం, ఆతర్వాత యధాతథంగా పట్టింపు కరువవ్వడం సర్వసాధారణమైపోయింది. దీంతో నకిలీ రాయుళ్లు పుట్టుకొస్తూ వారి మాయమాటల్లో పడి అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది.

అర్హత, అనుమతులు అక్కర్లేకుండానే..

వారికి అర్హత, అనుమతులు అక్కరలేదు. వచ్చీరాని వైద్యం చేస్తూ డబ్బులు దుండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా జిల్లా కేంద్రంలో పట్టించుకునే నాథేడేలేరు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే అన్నట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఫిర్యాదులు అందడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గత గురువారం ట్రంక్‌రోడ్‌లోని ఆక్యూపంక్చర్‌ క్లీనిక్‌, ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో కేరళ వైద్యం పేరుతో నిర్వహిస్తున్న క్లీనిక్‌ను సీజ్‌ చేశారు. కాగా, ఇలాంటి క్లీనిక్‌లు రోజుకొకటి పుట్టుకొస్తున్నా.. ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బోర్డులు లేకుండానే..

గతేడాది నవంబర్‌లో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు అర్హత లేకుండానే క్లీనిక్‌లు నడుపుతున్నట్లు గుర్తించి 41 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అర్హతకు మించి వైద్యం చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. అయితే ఈ మెడికల్‌ దందాను మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. వైద్య సేవలు అందించే పేరుతో నకిలీలు పలు మార్గాలు వెతుకుతున్నారు. కొందరు ఏకంగా అర్హత లేకున్నా ఎంబీబీఎస్‌ చదివినట్లుగా తమ పేరు పక్కన బోర్డుపై రాయించుకుంటూ ఆస్పత్రులను నిర్వహిస్తుండడం నకిలీ దందాకు పరాకాష్టగా చెప్పవచ్చు. అయితే మరికొందరు బోర్డులు లేకుండానే క్లీనిక్‌లు నడుపుతున్నట్లు ఇటీవల నగరంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెలుగుచూసింది. ఎలాంటి బోర్డులు, అనుమతులు లేకుండా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకొని కేరళ వైద్యం, ఆక్యూ పంక్చర్‌, హెర్బల్‌ క్లీనిక్‌ల పేరుతో దందాకు తెరలేపుతున్నారు. వారి వలలో పడే రోగులు రోగం తగ్గకపోగా, ఉన్న పైసలు వదిలించుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

అర్హతకు మించి వచ్చీరాని వైద్యం

ప్రజల ప్రాణాలతో చెలగాటం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ క్లినిక్‌లు అనుమతులు లేకుండా ఆస్పత్రుల నిర్వహణ బలవుతున్న నిండు ప్రాణాలు

కామేపల్లి మండలం పాతలింగాలకు చెందిన ఎం.శ్రీనివాస్‌(53) నరాల నొప్పులతో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. అయితే ఎటువంటి అర్హత, రిజిస్ట్రేషన్‌ లేకుండా అక్క్యూ పంక్చర్‌ చికిత్సలు చేస్తూ క్లీనిక్‌ నడుపుతున్న నరేష్‌కుమార్‌ వద్దకు వచ్చాడు. ఈక్రమంలో తనకు వచ్చీరాని వైద్యం చేయడంతో శ్రీనివాస్‌ మృతి చెందాడు. దీంతో బంధువులు వైద్య,ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా.. అధికారులు విచారణ చేపట్టి వచ్చీరాని వైద్యం చేయడంతోనే మృతి చెందినట్లు నిర్ధారించి అతడిపై కేసు నమోదు చేయించి, క్ల్లినిక్‌ను సీజ్‌ చేశారు.

అర్హత లేకుంటే సీజ్‌

అర్హత లేకుండా క్లీనిక్‌లు నడిపినా, ఆక్యూ పంక్చర్‌, హెర్బల్‌, కేరళ వైద్యం పేరుతో దందాకు తెరలేపినా నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇకపై ప్రతీ ఆస్పత్రిని తనిఖీ చేసి అర్హత కలిగిన వైద్యులు ఉన్నారా లేదా అని పర్యవేక్షిస్తాం. ఎవరైనా అర్హత లేకుండా వైద్యం అందిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి.. వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేలా పోలీసులకు సమాచారం ఇస్తాం. ప్రజలు కూడా నకిలీ వైద్యుల మాటలు నమ్మి వారు చెప్పే ఆస్పత్రులకు వెళ్లొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. సాధ్యమైనంత మేరకు ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి.

– డాక్టర్‌ బి.కళావతిబాయి, డీఎంహెచ్‌ఓ

కల్లూరు మండలానికి చెందిన చందు అనే యువకుడికి ఇటీవల జ్వరం రాగా.. ఓ ఆర్‌ఎంపీ సహకారంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అర్హత లేని వైద్యుడితో చికిత్స అందించగా.. అది వికటించి యువకుడు మృతి చెందాడు. దీంతో బాధితుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టగా.. పోలీసులు వచ్చి వారితో మాట్లాడి శాంతింపజేశారు. బంధువులు వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు.

అధికారుల చోద్యం!1
1/1

అధికారుల చోద్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement