
ప్రజాస్వామ్యం కోసం పోరాడాలి
ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో ఇంకా ఎంతో మంది నిరక్షరాస్యులు, అంటరానివారు ఉన్నారని, పాలకుల విధానాలతో వారు అనేక బాధలు పడుతున్నారని, ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పోరాటాలు చేయాలని కేరళ మాజీ మంత్రి కే.కే. శైలజ టీచర్ అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్మించిన ఖానాపురంహవేలి కార్యాలయం(సత్తెనపల్లి రామకృష్ణ భవన్)ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఆదివారం ఆమె ప్రారంభించారు. తొలుత సీపీఎం జిల్లా కార్యాలయం నుంచి రెడ్ షర్ట్ వలంటీర్లతో భారీ కవాతు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో శైలజ టీచర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కార్మికులు, కర్షకులు ఏకం కావాలన్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న కేరళలో విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళేనని అన్నారు. బూర్జువా పార్టీల పాలనలో పెట్టుబడిదారులు మరింత సంపన్నులుగా ఎదుగుతున్నారని, పేదలు మరింత పేదరికంలోకి వెళుతున్నారని అన్నారు. దోపిడీ, అసమానతలు, ఆకలి సమస్యలు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని, కమ్యూనిస్టులు ఉంటారని చెప్పారు. ఈ అసమానతలకు పరిష్కారం కార్మికవర్గ రాజ్యస్థాపనేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప పోరాట భూమి అని, ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం లాంటి నాయకుల పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టు కార్యాలయాలు అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలుగా నిలుస్తున్నాయని తెలిపారు. కరోనా కాలంలో రాష్ట్రంలో మొదట ప్రజల ముందుకొచ్చి వైద్య కార్యక్రమాలు నిర్వహించింది తమ పార్టీయేనని చెప్పారు. సీపీఎం ఖానాపురం హవేలి కార్యదర్శి దొంగల తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర నాయకులు బి.వెంకట్, ఎం.సాయిబాబు, పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, నాయకులు పి. సోమయ్య, ఎర్రా శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, వై.విక్రమ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, సత్తెనపల్లి మంగ, ఎస్.నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శైలజ టీచర్‌కు పలువురు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
కార్మికులు, కర్షకులు ఐక్యం కావాలి
తెలంగాణ గొప్ప ఉద్యమ భూమి
కేరళ మాజీ మంత్రి శైలజ

ప్రజాస్వామ్యం కోసం పోరాడాలి