నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి

Published Wed, Apr 17 2024 12:35 AM

మాట్లాడుతున్న ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌, పక్కన సీపీ సునీల్‌దత్‌  - Sakshi

● రేపటి నుంచి 25వరకు స్వీకరణ ● అభ్యర్థులకు సహకరించేలా హెల్ప్‌డెస్క్‌ ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ తెలిపారు. సీపీ సునీల్‌దత్‌తో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు సమర్పించొచ్చని తెలిపారు. ఈనెల 21న ఆదివారం సెలవు మినహా మిగతా ఏడు రోజుల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను సరిగా నింపారో, లేదో చూసుకునేందుకు హెల్ప్‌డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశామని, అఫిడవిట్‌లో వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ చివరిరోజు జనరల్‌ అబ్జర్వర్‌ వస్తారని కలెక్టర్‌ వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతుందని, ఈసీఐకి లైవ్‌ కాస్టింగ్‌ అవుతుందని తెలిపారు. ఇక 26న స్క్రూ టినీ చేపట్టి, 29వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తామని వెల్లడించారు. కాగా, ఈనెల 25న తుది ఓటర్ల జాబితా వెల్లడించనుండగా.. ఆ జాబితా ఆధారంగా ఓటు వేసేందుకు అవకాశముంటుందని తెలిపారు. సీపీ సునీల్‌దత్‌ మాట్లాడుతూ నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల అవతల వాహనాలను నిలిపేస్తామని, అభ్యర్థితోపాటు నామినేషన్‌ వేసే వారికి సంబంధించి మూడు వాహనాలనే అనుమతిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 102 కేసులు నమోదు చేయగా, రూ.1.12 కోట్లు సీజ్‌ చేశామని చెప్పారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్లు మయాంక్‌ సింగ్‌, యువరాజ్‌, మ్రినాల్‌ శ్రేష్ట, డీపీఆర్‌ ఎంఏ.గౌస్‌, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ రాంబాబు, మదన్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement