నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు నిప్పంటించుకోవడంతో వరి గడ్డి వాము కాలిపోయింది. మండలంలోని మండ్రాజుపల్లికి చెందిన రైతు యర్రపు శ్రీనివాసరావు 450 వరిగడ్డి దిండ్లకు శనివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే రూ.50వేల విలువైన గడ్డి కాలిపోయింది. కాగా, గడ్డి వాము పక్కనే పెద్దిరాజు బుర్రయ్యకు చెందిన పూరిగుడిసె ఉండగా. అగ్నిమాపక శాఖ సిబ్బంది ముందస్తుగా నీళ్లు చల్ల డంతో మంటలు అంటుకోలేదు. రైతు కు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాదంలో పల్లె ప్రకృతి వనాలు దగ్ధం
తల్లాడ: తల్లాడలో ఏర్పాటుచేసిన మూడు పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. తల్లాడ మేజర్ పంచాయతీ పరిధి ఎదుళ్ల చెరువు సమీపాన మూడెకరాల్లో తల్లాడ, నారాయణ పురం, మంగాపురం గ్రామాలకు చెందిన పల్లె ప్రకృతి వనాలను మూడెకరాల్లో ఏర్పాటు చేశారు. సమీప పొలాల రైతులు శనివారం చెత్తకు నిప్పు పట్టగా మంటలు పెరిగి పల్లె ప్రకృతి వనాల్లోని చెట్లకు అంటుకుంది. దీంతో మొక్కలు పాక్షికంగా కాలిపోయాయి. గ్రామపంచాయతీ ట్యాంకర్, ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.