
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్ గౌతమ్
● 20లోగా ఓటరు స్లిప్పులు పంపిణీ పూర్తి ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ఖమ్మం సహకారనగర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతీ ఉద్యోగి విధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సూచించారు. వెబ్ కాస్టింగ్, ఓటరు స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై బుధవారం ఆయన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పంచాయితీ రాజ్, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి వసతుల కల్పనపై దృష్టి సారించాలని, పోలింగ్ కేంద్రాల ప్రహరీలకు రంగులు వేయించాలన్నారు. ప్రహరీలు చోట వెంటనే నిర్మించాలని సూచించారు. అలాగే, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేయనుండగా, 190 సమస్యాత్మక కేంద్రాల్లో బయట వైపు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇక ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను అత్యవసర మందులతో నియమించాలని సూచించారు.
ఓటర్లకే స్లిప్పులు ఇవ్వాలి
ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీని గురువారం ప్రారంభించి ఈనెల 20 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అయితే, స్లిప్పులను ఓటర్లకు మాత్రమే అందజేయాలన్నారు. కాగా, పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తయినందున త్వరలోనే శిక్షణ ఉంటుందని తెలిపారు. ఫాం12డీ తిరస్కరిస్తే విషయాన్ని అభ్యర్థికి తెలియచేయాలన్నారు. ఇక కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న ఈవీఎం గోదాం పనులను కలెక్టర్ పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.
అనుక్షణం నిఘా
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుండి చెక్‌పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ అనుక్షణం నిఘా వేశామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్‌లో స్టాటిస్టిక్ సర్వైలెన్స్ బృందాలతో సమావేశమైన ఆయన తనిఖీల విషయమై పలు సూచనలు చేశారు. నిరంతర పర్యవక్షణతో ప్రభుత్వ, ప్రైవేట్ తేడాలేకుండా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్, జెడ్పీసీఈఓ వీ.వీ.అప్పారావు, ఎస్‌ఈ చంద్రమౌళి, సీపీఓ ఏ. శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సురేందర్, డీఆర్డీఓ విద్యాచందన, డీఈఓ సోమశేఖరశర్మ, డీఏఓ విజయనిర్మల, జిల్లా సహకార శాఖ అధికారి విజయకుమారి, డీపీఓ హరికిషన్, మిషన్ భగీరథ ఎస్‌ఈ సదాశివకుమార్, స్వీప్ నోడల్ అధికారి కె.శ్రీరామ్, కలెక్టరేట్ ఏఓ అరుణతోపాటు రాంబాబు, మదన్‌గోపాల్, మీనన్, సత్యనారాయణ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.