రాయచూరు రూరల్: పిల్లలను దత్తత తీసుకునే వారు చట్టప్రకారం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఇన్చార్జ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గణేష్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా పరిపాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దత్తత మాసోత్సవ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. దత్తత తీసుకున్న పిల్లల ఆరోగ్యం, విద్య, సంక్షేమం, బాగోగులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వీధుల్లో, చెత్తకుప్పల వద్ద, మురికి కాలువల సమీపంలో లభించే శిశువులను సంరక్షించి, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా దత్తతకు అందజేస్తారని తెలిపారు. పిల్లలను అనాథలుగా మారనీయకుండా వారికి ప్రేమ, ఆప్యాయతతో కూడిన జీవితాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారులు షఖీర్, శివకుమార్, శీతలా బాయి, ఈశ్వర్, బసయ్య, శోభ, దినేష్, తిక్కయ్య పాల్గొన్నారు.


