రాయచూరు రూరల్: మంగళ సూత్రం చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శుక్రవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలతో వివరాలు వెల్లడించారు. యరగేరలో ఈనెల 24వ తేదీన మహిళ మెడలోని మంగళ సూత్రాన్ని దొంగలు దోచుకుని పారిపోయిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాకు చెందిన మల్లం దొడ్డి బోయ రాజు, పరుశురామ్‌ను అరెస్ట్ చేసి, మాంగళ సూత్రం స్వాధీనం చేసుకున్నారు. మంగళ సూత్రం సుమారు 47 గ్రాములు ఉండగా.. విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ శాంతవీర, సీఐలు సాంబయ్య, నింగప్ప, ఎస్‌ఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
హొసపేటె: ‘క్రీడలతో శారీరక ధృడత్వం, మానసికోల్లాసం కలుగుతుంది. క్రీడల్లో గెలుపోటముల కంటే పాల్గొనడం ముఖ్యం’ అని డిప్యూటీ కమిషనర్ కవితా ఎస్.మన్నికేరి అన్నారు. శుక్రవారం నగరంలోని డీఏఆర్ గ్రౌండ్‌లో జిల్లా పోలీస్ వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో శాంతి భద్రతలు, ప్రజా భద్రతను కాపాడతారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణం స్పందించి సేవలు అందిస్తారని కొనియాడారు. పోలీసుల నిస్వార్థ సేవ, అంకితభావం సమాజ శాంతిలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసులను గౌరవించాలని సూచించారు. ఒత్తిడిని అధిగమించి మానసిక ప్రశాంతత, శారీరక ధృడత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడల్లో పాల్గొనాలని చెప్పారు. పోలీస్ శాఖ వార్షిక క్రీడలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో గెలిచిన వారు అహంకారం చూపకుండా గెలుపు, ఓటములను రెండింటినీ సమానంగా స్వీకరించాలన్నారు. అన్ని జట్లు ఉత్సాహంగా పాల్గొని క్రీడోత్సవాలను విజయవంతం చేయాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాహ్నవి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మురళీధర్, ఇతర పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హుబ్లీ బస్టాండ్‌కు శివశరణి హేమరెడ్డి మల్లమ్మ పేరు ఖరారు
హుబ్లీ: స్థానిక గోకుల్ రోడ్డులోని ఆర్టీసీ కేంద్ర బస్టాండ్‌కు శివశరణి హేమరెడ్డి మల్లమ్మ కేంద్రీయ బస్టాండ్‌గా నామకరణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇటీవల వ్యాయువ కేఎస్‌ఆర్‌టీసీ సంస్థను కిత్తూరు రాణి చెన్నమ్మ రోడ్డు రవాణా కార్పొరేషన్‌గా పునర్ నామకరణ చేసిన ప్రభుత్వం.. తాజాగా హుబ్లీ ప్రముఖ బస్టాండ్‌కు 15వ శాతాబ్దపు శివశరణి హేమరెడ్డి మల్లమ్మ పేరు పెట్టడానికి నిర్ణయించింది. గత ఆగస్టు 18న ప్రతిపాదనకు రాగా.. ఈనెల 23న అధికారికంగా ఆమోదం లభించింది. ఆర్టీసీ రెడ్డి ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం డీకే.శివకుమార్, రవాణా మంత్రి బైరెడ్డి సురేష్, మంత్రి రామలింగారెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
శుభకార్యం
హొసపేటె: హొసపేటె తాలూకాలోని ఓ రిసార్ట్‌లో మాజీ ఎమ్మెల్యే భీమా నాయక్ తనయుడు అశోక్ నాయక్, శిరీష దంపతుల వివాహ రిసెప్షన్ గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు.
లారీ ఢీకొని ప్రైవేట్ ఉద్యోగి మృతి
కెలమంగలం: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటన ఉద్దనపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఉద్దనపల్లి సమీపంలోని కన్నసంద్రం గ్రామానికి చెందిన తిరుమలేష్ (28). ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో హోసూరు– రాయకోట రోడ్డుపై వెళ్తుండగా.. క్రిష్ణాపురం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన తిరుమలేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై ఉద్దనపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


