● నేడు 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభం
● హాజరుకానున్న వైద్యశాఖ మంత్రి యు.టి.ఖాదర్
హొసపేటె: విజయనగర జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మరో కీలక అడుగు పడుతోంది. నగర శివారులోని జంబునాథ్ గ్రామం వద్ద జాతీయ రహదారి–67 రింగ్ రోడ్డుపై నిర్మించిన 250 పడకల నూతన జిల్లా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 10 గంటలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యుటి.ఖాదర్ ఫరీద్ ఆస్పత్రి భవనాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. జిల్లా యంత్రాంగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కేఎస్.బసవంతప్ప ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. ఎమ్మెల్యే హెచ్‌ఆర్.గవియప్ప అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటి వరకు వైద్యం సేవల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వచ్చిన జిల్లా ప్రజలకు 250 పడకల నూతన జిల్లా ఆస్పత్రి అందుబాటులోకి రానుండటంతో ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఆధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర గ్యారంటీ పథకాల అమలు శాఖ మంత్రి పిటి.పరమేశ్వర్ నాయక్, బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, దావణగెరె ఎంపీ డాక్టర్. ప్రభా మల్లికార్జున, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే నేమిరాజ్ నాయక్, కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్.ఎన్‌టీ.శ్రీనివాస్, హడగలి ఎమ్మెల్యే ఎల్.కృష్ణనాయక్, హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ లత తదితరులు పాల్గొననున్నారు.


