రాయచూరు రూరల్: మంత్రి పదవులు లభించని శాసన సభ్యులను నిగమ మండళ్లు, కార్పొరేషన్లకు అధ్యక్షులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సింధనూరు శాసన సభ్యుడు హంపన గౌడ బాదర్లి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (వేర్ హౌసింగ్ కార్పొరేషన్) అధ్యక్షుడిగా నియామకమయ్యారు. శుక్రవారం బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యులు వసంత కుమార్, శరణే గౌడ బయ్యాపూర్, మాజీ శాసనసభ్యుడు అమరే గౌడ బయ్యాపూర్ తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులో
నిందితుడి అరెస్ట్
హుబ్లీ: ఆస్తి వాటాల విషయంలో సొంత చినాన్నను హత్య చేసిన నిందితుడు సిరాజ్ ఖాన్ పఠాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పాత హుబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణతికట్టెలో మంగళవారం రాత్రి మెహబూబ్ నగర్ నివాసి అన్వార్ ఖాన్ పఠాన్ (46)ను హజగర్ కుమారుడు సిరాజ్ ఖాన్ పఠాన్ చాకుతో పొడిచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించారు. నిందితుడు సిరాజ్ ఖాన్ పఠాన్ లక్ష్మేశ్వరలో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
క్లస్టర్ విధానంతో
కార్మికులకు ఇబ్బందులు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో నూతనంగా ప్రవేశపెట్టనున్న బీసీ ఊట క్లస్టర్ విధానాన్ని విరమించుకోవాలని సీఐటీయూ అధ్యక్షుడు అడవిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన కాంట్రాక్టు కార్మికులకు నూతన క్లస్టర్ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గతంలో అమలులో ఉన్న పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించడంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, జీపీఎఫ్ సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వేతనాలు పెంచరూ..
రాయచూరు రూరల్: మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాలూకా అక్షర దాసోహ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సంఘం అధ్యక్షురాలు రేణుక మాట్లాడుతూ.. గత 24 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం నిష్పత్తిలో వేతనాలను పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
కనీస వేతనాలు చెల్లించాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐసీసీటీయూ సంఘం అధ్యక్షుడు నాగరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంతో పాటు వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోర్టులు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వచ్చే నెల 3వ తేదీన బెళగావిలో జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించేలా ఉభయ సభల్లో ఆమోదం పొందే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.


