మా వద్దే దండిగా ఏనుగులు | - | Sakshi
Sakshi News home page

మా వద్దే దండిగా ఏనుగులు

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

శివాజీనగర: హాసన్‌ జిల్లాలోని బేలూరు ప్రాంతం నుంచి ఏనుగులను పొరుగున ఉన్న చిక్కమగళూరులోని మూడిగెరె, భద్రా అభయారణ్య ప్రాంతాలకు ‘ఆపరేషన్‌ గజ’ పేరుతో తరలించడంపై వివాదం కొనసాగుతోంది. ఏనుగులను తమ ప్రాంతంలోకి తోలరాదంటూ బుధవారం ఉదయం నుంచి తాలూకావాసులు మూడిగెరె పట్టణంలోకి చేరుకుని బృహత్‌ ఆందోళన ప్రారంభించారు. రైతులు, పలు సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కూడలిలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాసన్‌ జిల్లా మంత్రిపై మండిపడ్డారు. ఏనుగులు వస్తే తమ ప్రాణాలు, పంటపొలాలు నష్టపోతామని ఆందోళన వ్యక్తంచేశారు. నిరసన నేపథ్యంలో మూడిగెరె పట్టణంలో బంద్‌ జరిగింది. పాఠశాలలు, అంగళ్లు, ఆఫీసులు మూతపడ్డాయి. అల్లర్లు జరగకుండా పోలీసులు గస్తీ కాశారు.

బెంగళూరులో ఎమ్మెల్యేల చర్చలు

ఏనుగుల తరలింపుపై అసంతృప్తి చెందిన చిక్కమగళూరుకు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్న హెచ్చరిక నుంచి వెనక్కి తగ్గారు. చిక్కమగళూరు ఎమ్మెల్యే తమ్మయ్య, మూడిగెరె ఎమ్మెల్యే నయనా మోటమ్మ, శృంగేరి ఎమ్మెల్యే రాజేగౌడ బెంగళూరులో స్పీకర్‌ జీ.ఎస్‌.పాటిల్‌ను కలిశారు. సమావేశంలో చర్చించిన తరువాత మెత్తబడ్డారు. సీఎం డీకే శివకుమార్‌ కూడా జపాన్‌ నుంచి వారితో ఫోన్‌లో మాట్లాడి నచ్చజెప్పారు.

హాసన్‌ జిల్లా ఏనుగులు రాకూడదు

చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో

ప్రజలచే బంద్‌

భారీగా నిరసన ప్రదర్శన

ముగ్గురు ఎమ్మెల్యేలతో సభాపతి చర్చలు

రాజీనామా వద్దని బుజ్జగింపు

ఇది నాటకం కాదు, నిజం: నయన

నయన మోటమ్మ మాట్లాడుతూ, అడవి ఏనుగుల సంచారం నిలిచింది, సమస్య పరిష్కారమైందని అన్నారు. మా రాజీనామా ముఖ్యమా, లేక పరిష్కారం ముఖ్యమా?, ఏనుగుల తరలింపును నిలిపివేస్తామని త్వరలోనే ప్రకటన వస్తుందన్నారు. వారు మాకు, ప్రజలకు తెలియకుండా ఆపరేషన్‌ చేపట్టారని ఆమె ఆరోపించారు. ప్రజల్లో భయం, ఆందోళన నెలకొన్నాయని, మేము ఎలాంటి నాటకం స్పష్టించలేదని ఆమె అన్నారు. మీరు దీన్ని హైడ్రామా అని అనుకుంటే అనుకోండి, రాజీనామా ప్రకటన చేశాను, దానిని ఇంకా వాపస్‌ తీసుకోలేదు అని ఆమె తెలిపారు.

ఎమ్మెల్యే టీ.డీ.రాజేగౌడ విలేకరులతో మాట్లాడుతూ నేను నా రాజీనామాను ప్రకటించలేదన్నారు. ‘భద్రా అడవికి 56 ఏనుగులను తరలిస్తామని అధికారులు చెప్పారు. మా జిల్లాలోనే 400 ఏనుగులు ఉన్నాయి. దాడుల్లో అనేక మరణాలను కూడా చూశాము. బయటి నుంచి ఏనుగును తీసుకువస్తే ఎలా?, స్పీకర్‌ అటవీ అధికారులను పిలిచి వారితో మాట్లాడారు. దీనిపై నవంబర్‌ 30న సమావేశం జరుగుతుంది. సీఎం లేనందున స్పీకరే మాతో మాట్లాడారు. అటవీ శాఖ మంత్రికి కూడా చెప్పాము’ అని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement