హైటెన్షన్‌ టవర్‌పై శవం | - | Sakshi
Sakshi News home page

హైటెన్షన్‌ టవర్‌పై శవం

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

శివమొగ్గ: సుమారు 60 అడుగుల ఎత్తైన హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభంపై ఓ మృతదేహం ఉంది. ఈ సంఘటన జిల్లాలోని భద్రావతి నగరం పేపర్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని జీపీఎస్‌ కాలనీలో బుధవారం జరిగింది. హైటెన్షన్‌ విద్యుత్‌ స్తంభంపై 110 కిలో వాట్ల విద్యుత్‌ ప్రసార శక్తి కలిగిన లైన్‌ వద్ద వ్యక్తి శవం వేలాడుతుండేది. ఉదయం దానిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్‌, పోలీసు, ఫైర్‌ సిబ్బంది చేరుకుని పరిశీలించారు. టవర్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. ఫైర్‌ సిబ్బంది నానా తంటాలు పడి పైకి ఎక్కి తాడుతో మృతదేహాన్ని కట్టి కిందకు దించారు. ఫైర్‌ అధికారి కృష్ణరాజు, సిబ్బంది ఆనంద్‌, సురేష్‌, మహేంద్ర, సంతోష్‌ పాల్గొన్నారు. మృతుని ఊరు, పేరు తెలియరాలేదు. మద్యం మత్తులో ఎక్కి కరెంటు షాక్‌తో చనిపోయి ఉంటాడని అనుమానాలున్నాయి.

రచయిత రవికి

ముందస్తు బెయిలు

బనశంకరి: వివాదాస్పద బసవ మంటప పుస్తక రచయిత రవి హంజ్‌కు బుధవారం బెంగళూరు 56వ సీసీహెచ్‌ కోర్డు ముందస్తు బెయిల్‌ను మంజూరుచేసింది. మంగళవారం సుదీర్ఘ వాదనలు ఆలకించిన జడ్జి మోహన్‌ప్రభు తీర్పును రిజర్వు చేశారు. చివరకు బెయిలును మంజూరు చేయడంతో రవి హంజ్‌కు ఊరట దక్కింది. పుస్తకంపై రవి హంజ్‌ వీడియో విడుదల చేశారు. పుస్తకంలో ఎలాంటి అవహేళన లేదని, బసవ పురాణాన్ని, పలు గెజెట్లను ప్రస్తావించానని చెప్పారు. కేసులు పెట్టి తనను కుంగదీయాలని ప్రయత్నం చేశారని, తాను సత్యవంతుణ్ణని అన్నారు.

రెండుచోట్ల పులి దాడులు

● రైతుకు గాయాలు

మైసూరు: చామరాజనగర జిల్లాలో రెండు చోట్ల పెద్దపులుల దాడులు జరిగాయి. పులి దాడిలో రైతుకు తీవ్రంగా గాయాలయ్యాయి. గుండ్లుపేట తాలూకా యడవనహళ్లి గ్రామంలో జరిగింది. సిద్ధబసవ నాయక అనే రైతు తన పొలంలో గొర్రెలను మేత కోసం తీసుకొచ్చాడు. ఈ సమయంలో ఒక పులి దాడి చేసింది. అతని కడుపు, చేతి భాగంలో గాయాలయ్యాయి. హఠాత్తుగా పులి తన మీదకు లంఘించిందని, చేతిలో పెద్ద ఇనుప కడ్డీ ఉండడంతో తాను భయపడలేదని తెలిపాడు. గట్టిగా కేకలు వేయడంతో అది పరిగెత్తిపోయిందన్నాడు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మేకపిల్లలు బలి

హనూరు తాలూకా కావేరి అభయారణ్యంలో బీజీ దొడ్డి గ్రామంలో పులి దాడిలో మూడు మేకపిల్లలు చనిపోయాయి. బుధవారం తెల్లవారుజామున కొట్టంలో ఉన్న మేకల అరుపులు విన్న యజమాని చెన్నమల్లేగౌడ బయటకు వచ్చి చూడగా పులి అక్కడి నుంచి అడవిలోకి పరుగులు తీసింది. కొట్టంలో 3 మేకపిల్లలను చంపి కొంతమేర భక్షించింది. డీసీఎఫ్‌ జగన్నాథ్‌ , ఆర్‌ఎఫ్‌వో సుందర్‌ పరిశీలించారు. గౌడకు పరిహారం ఇవ్వాలని, పులిని పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

కృపా ఆళ్వా మొబైల్‌ సీజ్‌

● స్వర నమూనాల సేకరణ

● స్టింగ్‌ కేసు పరుగులు

శివాజీనగర: మాజీ సీఎం సిద్దరామయ్యపై జరిగిన స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకురాలు కృపా ఆళ్వా మొబైల్‌ ఫోన్‌ను సీజ్‌ చేసి, ఆమె స్వర నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడంతో కేసు దర్యాప్తు వేగం పుంజుకున్నట్లయింది.

మొబైల్‌ కోసం ఒత్తిడి

సిద్దరామయ్య ఫిర్యాదు మేరకు కేసును బెంగళూరు పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు విచారణకు హాజరైన కృపా, ఎట్టకేలకు తన మొబైల్‌ ఫోన్‌ను దర్యాప్తు అధికారి, ఏసీపీ రవికి అప్పగించారు. స్టింగ్‌ వీడియోను రికార్డు చేసేటప్పుడు ఈ మొబైల్‌ ఫోన్‌నే ఉపయోగించారని చెబుతున్నారు. మీ మొబైల్‌ను అప్పగించాలని పోలీసులు పదే పదే కోరినా కృపా పట్టించుకోలేదని తెలిసింది. ఏసీపీ ఒత్తిడితో ఫోన్‌ ఇచ్చారు. అందులో అనేక ఫైళ్లను తీసేశారని తెలిసి పునరుద్ధరణకు ల్యాబ్‌కు పంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 2023 ఫిబ్రవరిలో వీడియోను చిత్రీకరించి, సెప్టెంబర్‌ 2026లో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ వీడియోలో కృపా ఆళ్వా, ఒక టీవీ చానెల్‌ ఎండీ కనిపించడంతో గగ్గోలు రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement