కర్ణాటక– జపాన్‌ భాయిభాయి | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక– జపాన్‌ భాయిభాయి

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

● ఆర్థిక సహకారానికి పెద్దపీట

● జపాన్‌ మంత్రితో సీఎం డీకే భేటీ

● 3వ రోజు పర్యటన

శివాజీనగర: ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ మూడవ రోజు బుధవారం టోక్యోలో జపాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి యసుటక నకనోనెతో సమావేశమయ్యారు. జపాన్‌, కర్ణాటక మధ్య ఆర్థిక సహకారాన్ని, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, కర్ణాటకలో జపాన్‌ పెట్టుబడులను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. జనవరిలో జరగనున్న కర్ణాటక గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2027లో పాల్గొనాలని సీఎం జపాన్‌ ప్రభుత్వ ఉన్నత స్థాయి బృందాన్ని ఆహ్వానించారు. బెంగళూరు మెట్రో రైలు, నీటి సరఫరా సహా వివిధ శాఖల సదుపాయాల ప్రాజెక్టులకు జపాన్‌ అందిస్తున్న నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక అభివృద్ధి ప్రాధాన్యతలకు కూడా సహకారం అందించాలని కోరారు. మంత్రి యసుటక స్పందిస్తూ జపాన్‌ పెట్టుబడులకు కర్ణాటక ఒక ప్రధాన గమ్యస్థానం, ఇరు ప్రాంతాల మధ్య కొనసాగుతున్న భాగస్వామ్యం వ్యాపార అభివృద్ధిలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు.

ఆశా కార్యకర్తలకు రూ.1500 పెంపు: ఎంపీ

దొడ్డబళ్లాపురం: డిమాండ్ల సాధనకై బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో ఆశా కార్యకర్తలు చేస్తున్న ఆందోళన గురించి బెంగళూరు రూరల్‌ ఎంపీ డా.సీఎన్‌ మంజునాథ్‌ స్పందిస్తూ తాను ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. రూ.1500 వరకూ గౌరవ వేతనం పెంచుతూ త్వరలో ప్రకటన చేస్తారని తెలిపారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈమేరకు ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు.

ఉత్తర కర్ణాటక రాష్ట్రం వద్దు

కాగా, బీజేపీ ఎమ్మెల్యే బాలచంద్ర జార్కిహొళి ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండును ప్రస్తావించగా, ఈ డిమాండు సమంజసం కాదన్నారు. అభివృద్ధి లేదనే కారణంతో రాష్ట్రాన్ని విభజించడం సబబు కాదన్నారు. భారీగా నిధులు విడుదల చేసినంత మాత్రాన కూడా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రజలకు మెరుగైన జీవితాలకు పథకాలు రూపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఆదాయంలో 40 శాతం బెంగళూరు నుంచే వస్తోందని, ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం వస్తే వారు వనరులు ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు.

అమ్మ బర్త్‌ డే పార్టీ ఇస్తానంటూ..

దొడ్డబళ్లాపురం: తన తల్లి పుట్టినరోజును స్నేహితులతో సంతోషంగా జరుపుకోవాలనుకుంటే విధి చిన్నచూపు చూసింది. బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన నెలమంగల తాలూకా బిన్నమంగల వద్ద జరిగింది. ఆలూరు నివాసి దిలీప్‌ (20), హారోక్యాతనహళ్లి నివాసి చేతన్‌ (21) మృతులు. చేతన్‌ తల్లి పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకు బిర్యానీ పార్టీ ఇవ్వాలనుకున్నాడు. వారిని ఓ హోటల్‌ వద్దకు రమ్మని చెప్పి దిలీప్‌ని బైక్‌పై ఎక్కించుకుని వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రగాయాలతో ఇద్దరూ అక్కడే మృతిచెందారు. నెలమంగల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement