మైసూరు: ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా నగరంలోని నారాయణ షష్ఠి రోడ్డులో ఉన్న శ్రీ రాఘవేంద్ర మఠంలో తులసి పండుగ సందర్భంగా భక్తులకు వందలాది తులసి మొక్కలను పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త రఘురామ్ వాజ్‌పేయ్ మాట్లాడుతూ, హిందూ మతం, ఆయుర్వేదంలో తులసి మొక్కకు చాలా పవిత్రమైన స్థానం ఉందని అన్నారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా, సంపద, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారని చెప్పారు. రాఘవేంద్ర కులకర్ణి, నాగశ్రీ సుచింద్ర, అపూర్వ పాల్గొన్నారు.
సీఎం ఇంటి ముందు వాటాళ్ ధర్నా
దొడ్డబళ్లాపురం: సీఎం డీకే శివకుమార్ కుమారకృప అతిథిగృహాన్ని అధికార నివాసంగా మార్చుకుని గంగ అని పేరు మార్చడం పట్ల కన్నడభాషా ఉద్యమ నేత వాటాళ్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కుమారకృప అనే పేరు ఉండగా, ఇప్పుడు గంగ గా పేరు మార్చడం సరికాదన్నారు. గురువారంనాడు గంగలో సీఎం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖులకు విందు ఇచ్చారు. ఈ సమయంలో వాటాళ్ నాగరాజు నల్ల బ్యాడ్జీ ధరించి అక్కడ ఆందోళన చేశారు. పాత పేరునే కొనసాగించాలని, లేదంటే కర్ణాటక బంద్‌కు పిలుపునిస్తామని చెప్పారు.
బైక్– ట్రక్ ఢీ, ఇద్దరు మృతి
దొడ్డబళ్లాపురం: బైక్‌ను ట్రక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన కలబుర్గి జిల్లా ఆళంద పట్టణంలోని పాత ఆర్టీఓ కార్యాలయం ముందు జరిగింది. బైక్‌పై వెళ్తున్న శ్రీకాంత్ (25), గురునాథ (26) మృతులు. బైక్‌పై ఉన్న మూడో వ్యక్తి శశికాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వచ్చిన ట్రక్ వీరిని ఢీకొనింది. ట్రక్ డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. ఆళంద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కేపీఎస్‌సీ స్కాం..
గీత ఇంట్లో సోదాలు
బనశంకరి: కేపీఎస్‌సీలో పశువైద్యాధికారుల ఉద్యోగాలను అమ్ముకున్నారనే కేసులో సిట్ అధికారులు ప్రముఖ నిందితురాలు, కేపీఎస్‌సీ సభ్యురాలు బీవీ.గీత ఇంట్లో సోదాలు నిర్వహించారు. గీతను విచారిస్తున్న సిట్ పోలీసులు మంగళవారం ఆమెను అరెస్టు చేయడం తెలిసిందే. బెంగళూరుతో సహా పలుచోట్ల ఆమె నివాసాల్లో సోదాలు జరిపి ఆర్థిక వ్యవహారాల ఫైళ్లు, బ్యాంకు పాస్‌బుక్‌లు, ఇతరత్రా ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నందీశ్ అనే అభ్యర్థి నుంచి గీత రూ.20 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపణలున్నాయి. కేపీఎస్‌సీ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్, ఐఏఎస్ జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్, బ్రోకరు బసవరాజు కన్నాళేతో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఇటీవలే అఫిడవిట్‌ను దాఖలు చేసింది. గీత ను కేపీఎస్‌సీ సభ్యురాలి పదవి నుంచి ప్రభుత్వం తొలగించనుంది. ఇందుకోసం కేబినెట్‌లో తీర్మానం చేసి గవర్నర్‌కు సిఫార్సు చేయనుంది.
చలి గుప్పిట్లో బెంగళూరు
● పగలూ, రాత్రి శీతలం
శివాజీనగర: బంగాళాఖాతంలో తుపాను, పైగా చలికాలం కావడంతో బెంగళూరులో చలి తీవ్రత పెరిగింది. గత నాలుగైదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా ఉంటోంది. మునుముందు శీతల వాతావరణం మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర గాలులు తేమను తీసుకువస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండటంతో రాత్రులు, తెల్లవారుజామున చల్లగా ఉంటోంది. చలి గాలుల వల్ల ఉదయం నుంచే ప్రజలు స్వెట్టర్లు ధరిస్తున్నారు.
మిగతా ప్రాంతాల్లోనూ
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ చలి మొదలైంది. ఉత్తర కర్ణాటకలో కనిష్ట తాపం 12 నుంచి 14 డిగ్రీలు, దక్షిణ, తీర ప్రాంతాలలో 16 నుంచి 18 డిగ్రీల మధ్య కొనసాగుతోంది. గత ఏడాది కన్నా ఈసారి చలిగాలుల తీవ్రంగా ఉండవచ్చని, ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ డైరెక్టర్ సీ.ఎస్.పాటిల్ తెలిపారు. బెంగళూరులో డిసెంబరు, జనవరిలో చలి మరింత పెరగవచ్చని తెలిపారు.


