ఇందిరమ్మకు ఘన నివాళులు | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మకు ఘన నివాళులు

Nov 20 2026 1:37 AM | Updated on Nov 20 2026 1:37 AM

తుమకూరు: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించారు. ఆమె సేవలను కొనియాడుతూ పుష్పాంజలి ఘటించారు. బ్యాంకుల జాతీయం, రైతుకే భూమి, వెట్టిచాకిరీ నిర్మూలన వంటి చట్టాలతో ఇందిరమ్మ పీడిత వర్గాలకు సహాయంగా నిలిచారని జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కొనియాడారు. తుమకూరులో పార్టీ ఆఫీసులో జయంతి ఉత్సవాలను ఆచరించారు. గ్రామానికి రోడ్డు, మండలానికి ఆసుపత్రి వంటి పథకాలు భారతదేశ దిశను మార్చాయని అన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినప్పటికీ, దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆపరేష్‌ బ్లూ స్టార్‌ను ప్రారంభించి, ఉగ్రవాదులను హతమార్చి, పంజాబ్‌ను కాపాడుకున్నారని చెప్పారు.

రాష్ట్రంలో మరో

16 ఇందిరా క్యాంటీన్లు

శివాజీనగర: పేదలకు తక్కువ ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్రంలోని వివిధ నగరాల్లో కొత్తగా నిర్మించిన 16 ఇందిరా క్యాంటీన్లను గురువారం ప్రారంభించినట్లు మంత్రి యతీంద్ర తెలిపారు. దివంగత ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బెంగళూరులోని నెహ్రూ ప్లానెటోరియంలో ఆర్భాటంగా నిర్వహించారు. సీఎం డీకే శివకుమార్‌, మంత్రులు పాల్గొన్నారు. పలువురు ఇందిరా క్యాంటీన్‌ నిర్వాహకుల సన్మానించడంతో పాటు పట్టణ యంత్రాంగాలకు పారిశుధ్య ఉపకరణాలు, యంత్రాలను అందజేశారు.

రూ.5కు చిత్రాన్నం తిన్నా: సీఎం

సీఎం మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ మరణించిన రోజు నేను ఢిల్లీకి వెళ్లే రైలులో ఉన్నాను, రైలును దొడ్డబళ్లాపురంలో నిలిపివేశారు, దేశవ్యాప్తంగా పెద్ద గందరగోళం చెలరేగింది అని తెలిపారు. కాగా, తాను స్టూడెంట్‌ లీడర్‌గా ఉన్నపుడు మెజెస్టిక్‌లో 5 రూపాయలకు చిత్రాన్నం తినేవారమని చెప్పారు. ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలి అని రాజీవ్‌గాంధీ చెప్పేవారన్నారు. ఆకలికి కుల, మత భేదం లేదంటూ ఇందిరా క్యాంటీన్ల ఉద్దేశాన్ని వివరించారు. ఇందిర జయంతినాడు మరిన్ని క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషకరమని మంత్రి యతీంద్ర అన్నారు.

యాంటీ రౌడీ స్క్వాడ్‌ షురూ

● సీసీబీ రద్దు

బనశంకరి: బెంగళూరు పోలీసు శాఖలో నగర నేరాల నియంత్రణ విభాగం (సీసీబీ) రద్దయింది. దానిని యాంటీ రౌడీ స్క్వాడ్‌ (ఏఆర్‌ఎస్‌) గా మార్చారు. దీంతో అనేక దశాబ్దాల చరిత్ర కలిగిన సీసీబీకి తెరపడింది. 1971లో స్పెషల్‌ స్క్వాడ్‌ పేరులో, ఓ ఏసీపీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. 1993లో సీసీబీ అని పేరు మార్చారు. డ్రగ్స్‌, ఇతర తీవ్ర నేరాలను అరికట్టే బాధ్యత అప్పగించారు. సీసీబీకి ఓ ఐజీ చీఫ్‌గా ఉండేవారు. కొత్త ఏఆర్‌ఎస్‌కు అదనపు డీజీపీ హేమంత్‌ నింబాళ్కర్‌ను కమిషనర్‌గా నియమించారు.

విద్యార్థులపై ఖాకీల దాడి

యశవంతపుర: దీపావళి పండుగనాడు రోడ్డుపై టపాసులను కాల్చారని మణిపాల్‌ నగరంలో పోలీసులు విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఫ్లాట్‌లోకి దూరి విద్యార్థులను చితకబాదిన వీడియోలు వ్యాప్తి చెందాయి. ప్రైవేట్‌ కాలేజీ విద్యార్థులు తమ ఫ్లాటులో చదువుకుంటూ ఉండగా పోలీసులు వెళ్లి చితకబాదడం వివాదంగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు సీఎం డీకే శివకుమార్‌కు లేఖ రాశారు. నెటిజన్లు పోలీసుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement