మైసూరు: తనను ప్రేమించలేదని ఉన్మాదిగా మారిన యువకుడు పెట్రోలు పోసుకుని నిప్పటించుకుని, యువతిని కావలించుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం మైసూరులోని విజయ నగరలో జరిగింది. వివరాలు... మండ్య జిల్లా మళవళ్లి తాలూకాలోని హలగూరుకు చెందిన చందన్ (27), ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని వెంట పడుతున్నారు. కానీ ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. మైసూరులో విజయ నగరలోని హాస్టల్ నుంచి కాలేజీ లోపలకు వెళ్తున్న ఆ విద్యార్థినిని చందన్ మాట్లాడాలంటూ నిలిపాడు. తనను ప్రేమించమని బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. ఇంతలోనే బాటిల్‌లో నుంచి పెట్రోల్‌ను తనపై పోసుకుని నిప్పంటించుకుని కేకలు వేస్తూ ఆ యువతిని పట్టుకున్నాడు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె దుండగున్ని విడిపించుకొని పరుగులు తీసింది. జనం ఎలాగో ఇద్దరి మంటలను ఆర్పివేశారు. యువతికి 20 శాతం, చందన్‌కు 80 శాతం కాలిన గాయాలయ్యాయి. ఆమెకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో, అతనికి మైసూరు ప్రభుత్వ కె.ఆర్. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువకుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనుమానంతో భార్య హత్య
దొడ్డబళ్లాపురం: భార్య శీలాన్ని శంకించిన భర్త ఆమెను హత్య చేసిన సంఘటన కలబుర్గి నగరంలో చోటుచేసుకుంది. రేణుక శింధె (38)ని భర్త సంజయ్ (43) నిత్యం అనుమానించేవాడు. అక్రమ సంబంధం కలిగి ఉందని రగడకు దిగేవాడు. సోమవారం రాత్రి కూడా పోట్లాట జరిగింది, ఆమెను గొంతు నులిమి చంపాడు. అశోక్ నగర పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
తాను నిప్పంటించుకుని,
యువతిని కావలించుకుని..
ఇద్దరికీ గాయాలు
మైసూరులో సంఘటన
చిన్నారిని చిదిమిన స్కూలు బస్సు
మైసూరు: ముద్దులొలికే పసిపాను స్కూల్ బస్సు బలిగొంది. జిల్లాలోని హుణసూరు తాలూకా నంజాపుర గ్రామంలో జరిగింది. బసవరాజు, కాంచన దంపతుల రెండేళ్ల కుమార్తె లతీక్ష (2) ఇంటి ముందు రోడ్డు పక్కన నిలిచి ఉండగా ప్రైవేటు స్కూలు బస్సు చిన్నారిని ఢీకొనడంతో తీవ్ర గాయాలతో చనిపోయింది. డ్రైవర్ సిద్దరాజును గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక అన్నయ్య అదే బస్సులో ఇంటి వస్తాడు. అతని కోసం పాప ఎదురుచూస్తుండగా డ్రైవరు నిర్లక్ష్యంగా నడపడంతో ఈ ఘోరం జరిగింది. బిళికెరె పోలీసులు డ్రైవరును అరెస్టు చేసి బస్సును సీజ్ చేశారు.


