శివాజీనగర: నైస్ రోడ్ ప్రాజెక్ట్‌లో జరిగిన దోపిడీపై విధానసౌధ మెట్లపై బహిరంగ చర్చ జరపాలని కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం బెంగళూరులో ఓ హోటల్‌లో సుదీర్ఘంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవేగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైస్ ప్రాజెక్టుపై సంతకం చేశారన్నది నిజమేనని, కానీ 2003లో డీకే శివకుమార్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి, అసలు ఒప్పందాన్ని పూర్తిగా మార్చేశారని ఆయన ఆరోపించారు. అసలు ఒప్పందం ప్రకారం రోడ్డు కోసం 6,999 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే డీ.కే.శివకుమార్ దీనిని 9,468 ఎకరాలకు పెంచారని, దీనిపై ఆయన సమాధానం ఇవ్వాలని కోరారు. ఏకే (అశోక్ ఖేణి), డీకే కలిసి అసలు ఒప్పందాన్ని పూర్తిగా మార్చివేశారని పలు డాక్యుమెంట్లను ప్రదర్శించారు. ఆ సమయంలో ఎస్.ఎం.కృష్ణ సీఎంగా, డీకే శివకుమార్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారని కుమారస్వామి తెలిపారు.
డీకేనే కారణం
ప్రాజెక్టులో మార్పుల వల్ల 10, 12 చెరువులు ధ్వంసమైనట్లు కుమారస్వామి ఆరోపించారు. ప్రాజెక్టులో ఈ గందరగోళం అంతటికి కారణం డీకేనే అన్నారు. నైస్ ప్రాజెక్టుకు గత ఏప్రిల్‌లో 30 ఏళ్లు పూర్తయ్యాయి, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. నైస్ భూముల్లో అశోక్ ఖేణి ఇంట్లోని వంటవాడికి కూడా అప్పటి ప్రభుత్వం ఎన్‌ఓసీ ఇచ్చింది, అతనికి ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, విచారణ జరిగితే, ఇది ఒక పెద్ద కుంభకోణం అవుతుందని అన్నారు.
సీఎం డీకేపై కేంద్రమంత్రి
కుమారస్వామి ధ్వజం


