ఇళ్ల ముందు కారు పార్కింగ్‌కు పన్ను వద్దు | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల ముందు కారు పార్కింగ్‌కు పన్ను వద్దు

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

● ప్రజల అభ్యంతరాలపై సర్కారు సమీక్ష

శివాజీనగర: బెంగళూరు సహా నగరాల్లో ఇళ్ల ముందు రోడ్లపై కార్లు పార్కింగ్‌ చేస్తే రుసుము విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. పార్కింగ్‌ నిబంధనలపై ప్రజల నుంచి వందలాది అభ్యంతరాలు అందగా, వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. నగరంలో పెరుగుతున్న వాహన రద్దీని నియంత్రించడం, ప్రజా రహదారులపై పార్కింగ్‌ వ్యవస్థను క్రమబద్ధీకరణ కోసం గ్రేటర్‌ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పార్కింగ్‌ నియమాలు– 2026 ముసాయిదాను రూపొందించింది. ఏడాదికి చిన్నకారుకు రూ.15000, సెడాన్‌కు రూ.20 వేలు, ఎస్‌యూవీకి రూ.25 వేలు రుసుము వసూలు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఇంటి ముందు కారు నిలిపితే పన్ను కట్టాలనడం మరింత భారం మోపుతుందని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. త్వరలో సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మురిపించిన ఓనం

బొమ్మనహళ్లి: బెంగళూరు బ్యాటరాయణపురలో ఉన్న జక్కూరులో కేరళ సొసైటీ ఆధ్వర్యంలో ఓనం పండుగను ఉత్సాహంగా జరిపారు. చండే వాయిద్యాలు, మహాబలి వేషధారణ, సమూహ నృత్యం, గానం, ఫ్యాషన్‌ షోతో సహా వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ఆహూతులను మురిపించాయి. స్థానికంగా స్థిరపడిన కేరళీయులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలలో పాల్గొన్న మంత్రి కృష్ణ బైరేగౌడ మాట్లాడుతూ, ఓనం అనేది కుల, మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ. కేరళ గొప్ప సాంస్కతిక వారసత్వం అని తెలిపారు. సామాజిక కార్యకర్త మీనాక్షి శేషాద్రి, ఎన్‌ ఎన్‌ శ్రీనివాసయ్య, ఎం.జయగోపాలగౌడ పాల్గొన్నారు.

దావణగెరెలో కిడ్నాప్‌ల దందా

● ముఠా పట్టివేత

దొడ్డబళ్ళాపురం: ధనవంతులు, వారి పిల్లలను కిడ్నాప్‌ చేస్తూ డబ్బులు వసూలు చేసే 10 మంది గల గ్యాంగ్‌ను దావణగెరె విద్యానగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... 9న దావణగెరెలో వస్త్ర వ్యాపారి కుమారున్ని (26) ఈ ముఠా కిడ్నాప్‌ చేసి ఆంజనేయ కాలనీలోని ఒక ఇంట్లో బంధించారు. రద్దయిన 2వేల నోట్లను మార్చాలని అతన్ని పిలిపించి కిడ్నాప్‌ చేశారు. మీ తండ్రికి ఫోన్‌ చేసి రూ.10 లక్షలు ఇప్పించాలని బెదిరించారు. బాధితుడు తెలివిగా వాట్సాప్‌ గ్రూప్‌లో తాను ఉన్న ప్రాంతం లొకేషన్‌ను పంపించాడు. తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు లొకేషన్‌ వద్దకు చేరుకుని బాధితున్ని కాపాడారు. ఇంతలో కిడ్నాపర్లు పారిపోయారు. పలుచోట్ల గాలించి బీఏఎంఎస్‌ చదువుతున్న విద్యార్థి గంగారామ్‌ని, ఇతరులను పట్టుకున్నారు. ఇతడే ముఠా నాయకుడని, పలు జిల్లాలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు.

బాలికల చేతుల్లో బీర్లు

● పావగడ హాస్టల్‌లో హల్‌చల్‌

తుమకూరు: తుమకూరు జిల్లాలోని పావగడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం పక్కనే ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రభుత్వ పోస్ట్‌–మెట్రిక్‌ బాలికల హాస్టల్‌లో క్రమశిక్షణ అపహాస్యం పాలైంది. సరస్వతీ కటాక్షం కోసం శ్రమించాల్సిన చోట అసాంఘిక పనులు జరుగుతున్నట్లు వెలుగుచూసింది. 100 మంది విద్యార్థినులు ఉండాల్సిన ఈ హాస్టల్‌లో, 60 నుంచి 80 మంది ఉంటున్నారు. వీరిలో చాలామంది గ్రామీణ కుటుంబాలకు చెందినవారు. గత రెండు రోజులుగా, హాస్టల్‌లోని కొందరు బాలికలు బీర్లు తాగుతూ అల్లరి చేస్తున్నట్లు వీడియోలు వైరల్‌ అయ్యాయి. హాస్టల్‌ నిర్వహణను వార్డెన్‌, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు, తల్లిదండ్రులు ఆరోపించారు. అసలు బాలికలకు బీర్లు ఎలా వచ్చారుకెవరు ఇచ్చారు అనేది మిస్టరీగా మారింది. హాస్టళ్లలోని చీకటి కోణాన్ని ఇది బట్టబయలు చేసింది. అన్ని హాస్టళ్లలో ప్రత్యేక తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement