బళ్లారి రూరల్: వాతావరణంలో మార్పుతో గత కొన్ని రోజులుగా జిల్లాలో కురుస్తున్న వానలతో రైతులు సంబరపడుతున్నారు. మెట్టభూముల్లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలకు పుష్కలంగా నీరందడంతో పంటలు పచ్చదనాన్ని సంతరించుకొన్నాయి. మరో పక్క తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల నీటితో సాగవుతున్న పంట పొలాలు కళకళలాడుతున్నాయి. అయితే ఆలస్యంగా వరినాట్లు వేసిన కొన్ని వరిపైర్లలోకి వర్షం వల్ల అధికంగా నీరు చేరి పైరు మునిగింది. అధికంగా నీరున్న పంట పొలాల్లో నుంచి రైతులు నీటిని గట్లు తెంచి బయటకు పంపుతున్నారు.
విజయనగరలో..
హొసపేటె: నగరంలో మంగళవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సాయంత్రం 7 గంటలకు నగరంలో వాన మొదలై రాత్రి 10 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు భారీగా వర్షం కురిసింది. విజయనగర జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి, కూడ్లిగి, కొట్టూరు, హడగలి, హరపనహళ్లి తాలూకాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు ముంచెత్తాయి.
రోడ్లపై నీటి మడుగులు
విజయనగర కాలేజీ రోడ్డు, టీబీ డ్యాం రోడ్డు, హరిహర రోడ్డు, హంపీ రోడ్డులో నీరు మడుగులా నిలిచి పోవడంతో ప్రజలు, మహిళలు, పిల్లలు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని సిద్దలింగప్ప చౌకి, ఎస్.ఆర్.నగర్, చిత్తవాడిగి ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరినట్లు నివేదికలు అందాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండతో బాధపడుతున్న ప్రజలకు మంగళవారం కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఈ ఆకస్మిక వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించినప్పటికీ వర్ష తీవ్రత వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు నానాయాతన పడ్డారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: జిల్లాలో భారీ వర్షం కురిిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు జడివాన కురిసింది. జిల్లాలో 52 మీ.మీ.వర్షం కురిసింది. ఎక్కడ చూసినా రహదారులు బురదమయంగా మారాయి. మున్నూరు వాడి, గాంధీ చౌక్, మహావీర్ చౌక్, కూరగాయల మార్కెట్‌లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. తీన్‌కందిల్‌లో రాతి ఏనుగు విగ్రహంలోకి వాన నీరు చేరాయి. అరబ్ మొహల్లా, షియాతలాబ్, ఖాదర్‌గుండా, నవాబ్ గడ్డలలోకి నీరు చేరాయి.
బళ్లారి నగర శివార్లలోని బత్రి వద్ద వానలకు నీట మునిగిన వరిపైరు
రాయచూరులో లోతట్టు ప్రాంత ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
వాయుగుండం ప్రభావంతో కుండపోత
సాధారణ జన జీవితానికి అంతరాయం


