అధికార దుర్వినియోగం.. డీహెచ్‌ఓపై వేటు | - | Sakshi
Sakshi News home page

అధికార దుర్వినియోగం.. డీహెచ్‌ఓపై వేటు

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

దొడ్డబళ్లాపురం: అధికార దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో బాగలకోటె డీహెచ్‌ఓ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విధులకు సరిగా హాజరు కాకపోవడం, ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం, అధికార దుర్వినియోగం, అనుచిత ప్రవర్తన, ముఖ్యంగా ప్రభుత్వ వైద్యాధికారిగా ఉన్న ఆయన కుమార్తె డాక్టర్‌ అంకితా యరగల్‌ విధులకు హాజరు కాకుండా ఎండీ చదువుతుండగా ఆమెకు వేతనాలు ఇచ్చినట్టు అనేక ఆరోపణలు రావడంతో ఆరోగ్య శాఖ కమిషనర్‌ గురుదత్త హెగ్డే సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

కన్నతల్లిని కడతేర్చిన కసాయి

దొడ్డబళ్లాపురం: తాగిన మత్తులో ఒక కసాయి కుమారుడు కన్న తల్లిని కడతేర్చిన ఘటన దావణగెరె తాలూకా ఆరనేకల్లు గ్రామంలో వెలుగు చూసింది. ప్రేమ(60) అనే మహిళను ఆమె కుమారుడు ఆనంద్‌ హత్య చేశాడు. గురువారం రాత్రి పీకలదాకా మద్యం తాగి వచ్చిన ఆనంద్‌ తల్లితో గొడవపడి ఆమె తలను గోడకేసి కొట్టి చంపాడు. హదడి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

మహిళా టెక్కీ విషాదాంతం

వంతెనపై నుంచి అండర్‌పాస్‌లోకి దూసుకొచ్చిన కారు

మండ్య: మండ్య జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ టెక్కీ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బెంగళూరులోని ఆర్‌.ఆర్‌.నగర్‌కు చెందిన అంజన (32), హరీష్‌ దంపతులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఉన్నారు. బెంగళూరు, మైసూరులలో సొంతంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అంజన మైసూరులోని తన కంపెనీ ఉద్యోగి నితిన్‌, భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తోంది. మండ్యకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉమ్మదహళ్లి గేట్‌ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి వంతెన పైనుంచి అండర్‌పాస్‌లోకి దూసుకెళ్లింది. కారు కిటికీ తెరుచుకోవడంతో వెనుక సీట్‌లో ఉన్న అంజన కింద పడిపోయింది. తల రోడ్డుకు తగలడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గాయపడిన హరీష్‌, నితిన్‌ను మిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తులో ఉంది.

బాలుడి కిడ్నాప్‌.. హత్య

దొడ్డబళ్లాపురం: బాలుడిని కిడ్నాప్‌ చేసి హత్యకు పాల్పడిన దారుణ సంఘటన బెంగళూరు చిక్కజాలలో చోటు చేసుకుంది. యలహంకలోని వినాయకనగర్‌లో బాలుడు ప్రజ్వల్‌(13) కుటుంబం నివాసం ఉంటటోంది. పక్కనే భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి కుటుంబం ఉంటోంది. రెండు కుటుంబాలూ ఆర్థికంగా బాగున్నాయి. ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి పలకరించుకునేవారు. ప్రజ్వల్‌ తండ్రి మనోహర్‌ రియల్‌ ఎస్టేట్‌, ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవాడు. ప్రజ్వల్‌కి కార్లంటే మోజు. ఈ విషయం తెలిసిన భాస్కర్‌ రెడ్డి ఈనెల 16న కారులో వెళ్లి గణపతి పండగకు టపాసులు తెద్దామని పిలుచుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న భాస్కర్‌ రెడ్డి ప్రజ్వల్‌తో ఒక వీడియో తీయించి రూ.కోటి డబ్బు ఇవ్వాలని, లేకుంటే ప్రజ్వల్‌ను చంపేస్తానని ప్రజ్వల్‌ తండ్రిని బెదిరించాడు. భాస్కర్‌ రెడ్డికి కాల్‌ చేసి ఇలాంటి పనులు చేయవద్దని, వెంటనే ప్రజ్వల్‌ను తీసుకుని వచ్చేయాలని కోరారు. తక్షణం నిందితుడిని వెదకడానికి బయలుదేరారు.

సిమెంట్‌ ఇటుకతో తలపై కొట్టి..

ప్లాన్‌ ఫ్లాప్‌ అయిందని భయపడ్డ భాస్కర్‌ రెడ్డి కారులోనే ప్రజ్వల్‌ను సిమెంట్‌ ఇటుకతో తలపై కొట్టి హత్య చేసి శవాన్ని కారు డిక్కీలో వేసుకుని ఆంధ్రప్రదేశ్‌కి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా కారులో వేగంగా వెళ్తూ బళ్లారి రోడ్డులో ఇతర వాహనాలను ఢీకొన్నాడు. దీంతో వాహనదారులు అతడిని పట్టుకుని చితకబాదారు. పోలీసులు అక్కడకు చేరుకుని కారును పరిశీలించగా ప్రజ్వల్‌ మృతదేహం కనిపించింది. ప్రమాదంలో చనిపోయాడని నమ్మించాలని చూసినా పోలీసులు ప్రజ్వల్‌ తలపై అయిన బలమైన గాయం చూసి హత్యగా తేల్చారు. వెంటనే భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేశారు. అతనికి సహకరించిన ఏడుకొండలు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. చిక్కజాల పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement