బొమ్మనహళ్లి : ఆనేకల్ తాలూకా చందాపురలో ఉన్న జాతీయ రహదారి– 44లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఐదు నుంచి ఆరు గంటల పాటు ఇబ్బందుల పాలయ్యారు.చందాపుర సర్కిల్ అనేది బెంగళూరు, అనెకల్, దొమ్మసంద్ర, అత్తిబెలెలను తమిళనాడులోని హోసూరుతో కలిపే ప్రధాన మార్గం. ఈక్రమంలో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి పోటెత్తడంతో చందాపుర సర్కిల్ నుంచి 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చందాపుర, లక్ష్మీసాగర మధ్య హైవేపై వాహనాల భారీ క్యూ కనిపించింది. కిలోమీటరు కదలడానికే గంట సమయం పట్టడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలకు గురయ్యారు. జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డుకు చేరుకోవడం కూడా అసాధ్యంగా మారింది. ‘45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం పట్టింది. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు చందాపుర నుంచి పాఠశాల బస్సులో బయలుదేరాం. ఓల్డ్ చందాపుర సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు చేరుకునేసరికి సమయం ఉదయం 10.40 గంటలైంది. ట్రాఫిక్ జామ్ కారణంగా మేం పాఠశాలకు ఆలస్యంగా వెళ్తున్నాము. దీనివల్ల తరగతుల్లోని మొదటి రెండు పీరియడ్లను కోల్పోతున్నాం‘ అని విద్యార్థిని భువన వాపోయింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో ట్రాఫిక్ రద్దీ సమస్య మరింత తీవ్రమైందని చందాపురకు చెందిన భవ్య మాదేశ్ అన్నారు.


