రైతులకు పరిహారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు పరిహారం ఇవ్వాలి

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

నీటి పారుదల శాఖ కార్యాలయం తరలింపు తగదు

రాయచూరు రూరల్‌: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కార్‌ స్పందించే వరకూ ఆందోళన చేపడుతామని రైతు పోరాట సమితి నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం కలబుర్గిలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవాధ్యక్షుడు చామరసమాలి పాటిల్‌ మాట్లాడారు. ఫసల్‌ బీమా పథకంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. పత్తి పంటకు నష్ట పరిహారం మంజూరు చేయలేదని మండిపడ్డారు. రైతులు విక్రయించిన జొన్నలకు నేటికీ డబ్బు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు పరిహారం ఇవ్వాలని సూచించారు. వర్షాభావంతో పత్తి, మిరప, వరి పంటలు ఎండుముఖం పట్టాయన్నారు.

బాల కార్మికులకు విముక్తి

హుబ్లీ: హుబ్లీ ప్రాంతంలో బేకరీలు, ఫ్యాక్టరీలు, హోటల్‌, బార్లలో బాల కార్మికులు ఉన్నట్లు సమాచారం రావడంతో కార్మిక శాఖ, పోలీస్‌ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. హుబ్లీ తాలూకాలో 10, ధార్వాడలో ఇద్దరు, కలఘటగిలో ఇద్దరితో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 మంది బాల కార్మికులకు పనుల నుంచి విముక్తి కల్పించారు. ఇందులో ఐదుగురు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన చిన్నారులను బాలల సంక్షేమ సమితి ఎదుట హాజరుపరిచారు. పిల్లలను బడిలో చేర్పిస్తామని అధికారులు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. విద్యా బుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లలకు డబ్బు ఆశ చూపించి పనుల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కారు బోల్తా.. ఒకరు మృతి

హుబ్లీ: కారు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హుబ్లీ సమీపంలోని జాతీయ రహదారి–67పై అన్నిగేరి పెట్రోలు బంక్‌ వద్ద చోటు చేసుకుంది. మృతుడిని కొట్రప్ప మలకప్ప యారేడ్‌గా (58) గుర్తించారు. శంభులింగ, సిద్దలింగప్ప, గురురాజుతో కలిసి కారులో హువినహడగలి నుంచి హుబ్లీకి కారులో బయలుదేరారు. అన్నిగేరి పెట్రోలు బంక్‌ వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అన్నిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

రాయచూరు రూరల్‌: నగరంలోని ఉప్పరవాడిలో ఉన్న లక్ష్మీ వేంకటేశ్వర మందిరంలో శుక్రవారం సాయంత్రం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో వేయించిన శ్రీకృష్ణుడి వేషధారణలు ఆకట్టుకున్నాయి. అలాగే స్థానిక విఠల్‌ రుక్మిణి మందిరంలో కూడా కృష్ణాష్టమిని పురస్కరించుకుని పలు విశేష పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

రాయచూరు రూరల్‌: జిల్లాలో సాగు నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని రాయచూరుకు తరలించడం తగదని రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. నారాయణపుర కుడి కాలువకు సంబంధించి చిక్క హోణకునిలోని డివిజన్‌ కార్యాలయాన్ని రాయచూరుకు తరలించొద్దన్నారు. దేవదుర్గలో ఉండేలా చొరవ తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ రైతు విరోధి

చింతామణి: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలభిస్తోందని రాష్ట్ర జేడీఎస్‌ కోర్‌ కమిటీ అధ్యక్షుడు జేకే కృష్ణారెడ్డి వెల్లడించారు. శుక్రవారం వీపీ కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా స్ధాయి కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిడది టౌన్‌షిప్‌ పథకాన్ని అమలు చేయకూడదని రైతులు ఎన్ని సార్లు పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కుమారస్వామి చేసిన అభివృద్ధని ఇంటింటికీ తిరిగి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. శిడ్లఘట్ట ఎమ్మెల్యే రవికుమార్‌, ఎంపీ మల్లేష్‌ బాబు, మాజీ ఎంపీ పుట్టరాజు, ఎమ్మెల్యే మంజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement