హోసూరు: క్రిష్ణగిరిని కరువు జిల్లాగా ప్రకటించి, రాయితీపై పశువులకు పశుగ్రాసం అందించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టరేట్‌లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై 141 వినతిపత్రాలు అందాయి. ఈ సందర్భంగా క్రిష్ణగిరి జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వర్షాభావంతో అడవులు, పొలాల్లో గడ్డి పూర్తిగా ఎండిపోయిందన్నారు. పశువులకు మేత లభించడం లేదని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ స్థలాల్లో గడ్డి పెంచి రాయితీపై అందజేయాలని సూచించారు. సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా రసాయన ఎరువులు విక్రయిస్తున్న దుకాణాలు చర్యలు తీసుకోవాలన్నారు. సహకార సంఘాల ద్వారా రుణాలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మంజుళ, ఉమా మహేశ్వరి, గుణవతి, రాజ, మహేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.


