హొసపేటె: విజయనగర జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కేఎస్.బసవంతప్ప తెలిపారు. శుక్రవారం జిల్లా స్టేడియంలో విజయనగర జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కళ్యాణ కర్ణాటక ఏకీకరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ, దౌర్జన్య పాలన నుంచి హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. 1947 ఆగస్టు 15న యావత్ దేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందినప్పటికీ నిజాం పాలనలో ఉన్న కల్బుర్గి, బీదర్, రాయచూర్, కొప్పల్, యాద్గిర్, బళ్లారి ప్రాంతాల ప్రజలకు స్వాతంత్య్రం లభించలేదని తెలిపారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలు భారత యూనియన్‌లో విలీనం కావాలనే లక్ష్యంతో పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన స్వామి రామానంద తీర్థ, డాక్టర్ మేల్కోటే, అన్నదానయ్య పురాణిక్, ప్రభురాజ్ పాటిల్, శివమూర్తిస్వామ అలవంది, డాక్టర్.చర్చి, అలవంధర్, భీమాసేన రావు, శ్రీనివాసచార్, హనుమంతరావు తదితరుల త్యాగాలను స్మరించుకున్నారు.


