హోసూరు: ఎంఎస్‌ఎంఈ సంగమం లఘు ఉద్యోగ్ భారత్ తమిళనాడు సంస్థ ద్వారా చిన్న, సన్నకారు పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్న వస్తువుల ప్రదర్శనను హోసూరు ఎమ్మెల్యే పి.బాలకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. హోసూరు పారిశ్రామికవాడ మూకొండపల్లిలోని హిల్స్ హోటల్‌లో రెండు రోజుల పాటు ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో హోసూరు మహా నగరం ప్రపంచ స్థాయికి ఎదిగిందన్నారు. చిన్న, సన్నకారు పరిశ్రమల ప్రోత్సాహంతోనే పెద్ద పెద్ద పరిశ్రమలు ఆదరణ పొందుతున్నాయని గుర్తు చేశారు. ఎంఎస్‌ఎంఈ సంగమం ద్వారా ఉత్పత్తుల అమ్మకదారులు, కొనుగోలుదారులను ఒక తాటిపైకి తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన చిన్న, సన్నకారు పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. హోసూరు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది ఈ ప్రదర్శనను తిలకించారు.


