బనశంకరి: ఆనందోత్సాహాలతో గణేశ్ చతుర్థిని జరుపుకొని నిద్రించిన కుటుంబంపై మృత్యువు పంజా విసిరిసింది. ఫ్రిడ్జ్ పేలిపోవడంతో నలుగురు సజీవ దహనమయ్యారు. బెళగావి నగరంలో ఈ ఘోర విషాదం సంభవించింది. వివరాలు.. బెళగావి నగరంలోని మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చవ్హాట గల్లీలో గజానన దమానె (65) కుటుంబం రేకులు షెడ్‌లో నివసిస్తోంది.
శ్రమనే నమ్ముకుని..
గజానన కార్లకు పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. రోషన్ (21) ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. గజానన భార్య శారద (45), కుమార్తెలు ప్రియా (28), గంగా (25), ఆయన సోదరి భారతి రాజారాం (50) అదే షెడ్డు ఇంట్లో జీవిస్తున్నారు. గంగా, ప్రియా కుటుంబానికి బాసటగా ఉండాలని ఓ జిరాక్స్ దుకాణంలో పనిచేస్తున్నారు. సోదరి టైలరింగ్ చేసేది.
అంతటా విధ్వంసం
వినాయక చవితి కావడంతో అందరూ సోమవారం ఉదయం ఇంట్లో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసి పిండివంటలు ఆరగించారు. రాత్రి నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఫ్రిడ్జ్ భారీ విస్ఫోటం చెందడంతో రేకుల షెడ్డు తుత్తునియలైంది. ఇంట్లోని వస్తువులు బయటకు దూసుకొచ్చాయి. ఇంట్లో పెద్దగా పొగ, మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని శారద, ప్రియ, గంగ, భారతి ప్రాణాలు కోల్పోయారు. గజానన, రోషన్ తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు, పోలీసులు చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇంట్లోని వస్తుసామగ్రి, విలువైన సొత్తు బూడిదైంది. గ్యాస్ సిలిండర్ మాత్రం పేలలేదు. దీంతో చుట్టుపక్కల వారికి మరింత ప్రమాదం తప్పింది. మొదట్లో సిలిండర్ పేలుడు అనుకున్నారు. కొంతసేపటికి ఫ్రిడ్జ్ పేలిందని తెలుసుకున్నారు.
తీవ్ర భయభ్రాంతులు
గజానన అత్త గోదావరి మాట్లాడుతూ తాము ఇంట్లో ముందు భాగంలో నిద్రించడంతో క్షేమంగా బయటపడ్డామని తెలిపింది. పండుగరోజున భారీ దుర్ఘటన జరగడం, కుటుంబంలో నలుగురు చనిపోవడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కుటుంబమే సజీవ దహనమైందని బంధువులు విలపించారు.
షార్ట్ సర్క్యూట్ కావచ్చు: పోలీసు కమిషనర్
బెళగావి పోలీస్ కమిషనర్ ప్రకాశ్ నికం మాట్లాడుతూ గజానన 80 శాతం గాయపడగా, కుమారునికి 40 శాతం గాయాలైనట్లు తెలిపారు. కరెంటు వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఏర్పడ్డాయని అన్నారు. మృతదేహాలకు బెళగావి ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రమాదస్థలిని ఫోరెన్సిక్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ఎమ్మెల్యే అసిఫ్ సేట్ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
ఆదుకుంటాం: మంత్రి
మంత్రి సతీశ్ జార్కిహొళి మాట్లాడుతూ క్షతగాత్రులకు చికిత్స, ఇంటి వసతిపై కలెక్టర్‌తో చర్చించి పరిహారం అందిస్తామని తెలిపారు.
మృతులు తల్లీకుమార్తెలు శారద, ప్రియా, గంగ మేనత్త (ఫైల్)
ఫ్రిడ్జ్ పేలుతుందా?
రాష్ట్రంలో గతంలోనూ ఫ్రిజ్‌లు పేలి ప్రాణనష్టం జరిగిన ఘటనలున్నాయి. ఫ్రిజ్‌లో అత్యంత ఒత్తిడి వాయువుతో కూడిన కంప్రెసర్ ఉంటుందని, తేడా వస్తే అది పేలిపోతుందని మెకానిక్‌లు తెలిపారు. ఫ్రిడ్జ్‌ను లోపల, బయట శుభ్రంగా ఉంచుకోవాలి. లోపల ఐస్ గడ్డలు కట్టకుండా చూసుకోవాలి. ఫ్రిడ్జ్ కనెక్షన్ వైరు సరిగా ఉండాలి. సాకెట్ లోపల , ఫ్రిడ్జ్‌లో షార్ట్ సర్క్యూట్ కాకుండా నాణ్యమైన వైర్లు, సాకెట్‌లను ఉపయోగించాలని మెకానిక్‌లు తెలిపారు. కంప్రెసర్ లీకేజీ కాకూడదు. అప్పుడప్పుడు మెకానిక్‌లతో ఫ్రిడ్జ్‌ను తనిఖీ చేయించి అవసరమైతే సర్వీసింగ్ చేయించాలని చెప్పారు.
తల్లి, ఇద్దరు కూతుళ్లు, అత్త సజీవ దహనం
తండ్రీ కుమారునికి తీవ్ర గాయాలు
బెళగావి నగరంలో అర్ధరాత్రి ఘోరం


