తుమకూరు దసరా లోగో విడుదల | - | Sakshi
Sakshi News home page

తుమకూరు దసరా లోగో విడుదల

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

తుమకూరు: ఈసారి తుమకూరు దసరాను అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాం. ఈ ప్రదర్శన ఏఐ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి చోటిస్తుంది. 2000 మందికి పైగా పిల్లలకు వివిధ సాంస్కతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర్‌ తెలిపారు. మంగళవారం తుమకూరు నగరంలోని సెంట్రల్‌ లైబ్రరీ హాల్‌లో తుమకూరు దసరా ఉత్సవ లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. తుమకూరుకు కీర్తి, తేజస్సు తెచ్చే విధంగా దసరా పండుగను జరపాలని తెలిపారు. అక్టోబర్‌ 11 నుంచి 21 వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయన్నారు. నగర ఎమ్మెల్యే జి. బి. జ్యోతిగణేష్‌, బీఎంటీసీ ఉపాధ్యక్షుడు నికేత్‌ రాజ్‌ మౌర్య, కలెక్టర్‌, ఎస్పీలు పాల్గొన్నారు.

హైకమాండ్‌ దూతల రాక

పదవుల భర్తీపై నేడు చర్చలు

శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వంపై హైకమాండ్‌ దృష్టి సారించింది. ముఖ్యమైన చర్చలకు ఇన్‌చార్జి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, కే.సీ.వేణుగోపాల్‌ మంగళవారం రాత్రికి బెంగళూరుకు చేరుకొన్నారు. బుధవారం వారు రెండు ముఖ్యమైన సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం డీ.కే.శివకుమార్‌, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్‌లతో భేటీ జరుపుతారు. మొదట కొత్తగా ఎన్నికై న డీసీసీ అధ్యక్షులతో సమావేశం అవుతారు. సీఎంతో భేటీలో కార్పొరేషన్‌, బోర్డు అధ్యక్ష పదవుల నియామకం గురించి చర్చిస్తారు. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీ ప్రస్తావనకు రావచ్చు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పని చేయడానికి ఒక వ్యూహాన్ని రూపొందించే అవకాశముంది.

భార్యను కాల్చి, భర్త ఆత్మహత్య

యశవంతపుర: భార్యను తుపాకీతో కాల్చి హత్య చేసి, భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా సోమవారపేట తాలూకా కుంబారగడి గ్రామంలో జరిగింది. కన్నికండ కొడవ కుటుంబానికి చెందిన సుబ్బయ్య (72), భార్య భోజమ్మ (67)ను ఇంట్లోని తుపాకీతో కాల్చిచంపాడు. తరువాత అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ గొడవలే కారణమని అనుమానాలున్నాయి. జిల్లా ఎస్పీ బిందుమణి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

కేపీఎస్‌సీ స్కాంలో

సాక్ష్యాలు సీజ్‌

దొడ్డబళ్లాపురం: కేపీఎస్‌సీ పశు వైద్యాధికారుల ఉద్యోగాల స్కాంలో దళారీ బసవరాజు కన్నాళె, ఐఏఎస్‌ జ్ఞానేంద్రకుమార్‌ల పాత్రపై మరిన్ని రుజువులు లభించాయి. పరీక్షలకు ముందే దేవనహళ్లి సమీపంలోని రిసార్ట్‌లో అభ్యర్థుల చేత సమాధానాలు రాయించారని తెలిసింది. జ్ఞానేంద్రకుమార్‌ వారికి ప్రశ్నాపత్రాలు ఇచ్చి రాజాజీనగర, మెజెస్టిక్‌ నుంచి క్యాబ్‌లలో రిసార్ట్‌కు తీసుకువచ్చి సమాధానాలు రాయించారు. ఇందుకోసం లక్షల రూపాయలను వసూలు చేశారు. సీఐడీ అధికారులు ఆ రిసార్ట్‌లోని సీసీ కెమెరాల చిత్రాలను స్వాధీనం చేసుకుని, క్యాబ్‌లు సీజ్‌ చేశారు. రిసార్ట్‌ సెక్యూరిటీ గార్డును సాక్షిగా పేర్కొన్నారు. స్కాం రట్టు కాగానే నిందిత అభ్యర్థులు తమ మొబైళ్లు, పెన్‌డ్రైవ్‌లు శ్రీరంగపట్టణలో కావేరి నదిలో విసిరేశారని తేలింది.

కూలిన చెట్టు, ఆగిన రైలు

శివమొగ్గ వద్ద ఘటన

శివమొగ్గ: రైల్వే ట్రాక్‌లపై చెట్టు పడటంతో తలగుప్ప నుంచి బెంగళూరు వెళ్తున్న రైలు అరసలు సమీపంలో నిలిచిపోయింది. మంగళవారం ఉదయం 5.20 గంటలకు తలగుప్ప నుంచి బయలుదేరిన ఈ రైలు ఉదయం 7 గంటలకు శివమొగ్గకు, మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరుకు చేరుకోవాలి. అయితే, అరసలు దగ్గర పట్టాలపై చెట్టు పడిందని తెలిసి రైలును ముందుగానే ఆనెకెరె – నెవటూర్‌ గ్రామాల మధ్యలో నిలిపివేశారు. బెంగళూరులో ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లాల్సిన వందలాది ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చెట్టును తొలగించడానికి 2 గంటలు పట్టినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement