దొడ్డబళ్లాపురం: ఈ ఏడాది రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది, ఇప్పటికే 200 తాలూకాల్లో తీవ్రమైన కరువు ఏర్పడినట్టు గుర్తించినట్టు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. మంగళవారం కనకపురలోని నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికి 102 కరువు తాలూకాలుగా ప్రకటించామన్నారు. త్వరలో మరిన్ని తాలూకాలను ప్రకటిస్తామని చెప్పారు. కరువు కారణంగా విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయిందని, గత వారం 19 వేల మెగావాట్ల విద్యుత్‌కు డిమాండు ఏర్పడిందన్నారు. వేడి వాతావరణం వల్ల రాత్రిళ్లు విద్యుత్ అధికంగా ఖర్చవుతోందన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కరెంటును కొనాలని మంత్రులకు సూచించానన్నారు. వర్షాభావం కొనసాగితే తీవ్ర కరువు ఏర్పడుతుందన్నారు. 18న దక్షిణ కన్నడ జిల్లాలో కేబినెట్ మీటింగ్ గురించి మంత్రులతో మాట్లాడినట్లు, అక్కడ అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తామని తెలిపారు.
ఏం జరుగుతుందో: సీఎం
శివాజీనగర: ప్రజాస్వామ్యంలో పౌరులే పాలకులని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ తెలిపారు. విధానసౌధలో ప్రజాస్వామ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది ప్రజలు ఎస్‌ఐఆర్ కారణంగా ఓటు కోల్పోయే పరిస్థితి నెలకొంది. 47 లక్షల మందికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం వారు అవసరమైన పత్రాలను సమర్పిస్తున్నారని తెలిపారు. అప్పట్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ప్రజలు మాకు 136 సీట్లు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఇకపై ఏమి జరుగుతుందో నేను ఇప్పుడు మాట్లాడనని డీకే చెప్పడం గమనార్హం.
రెచ్చగొట్టడమే బీజేపీ పని
శివాజీనగర: బీజేపీ ఎదను చీల్చితే అందులో రాష్ట్ర ప్రయోజనాలకు సేవ చేసే అంశం ఏమీ లేదు. వారిదంతా రాజకీయ మనస్తత్వం మాత్రమే అని సీఎం డీ.కే.శివకుమార్ ఆరోపించారు. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా నగరంలో కే.ఆర్.సర్కిల్‌లోని సర్.ఎం.విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రతిదానిలో బీజేపీ తప్పులు వెతుకుతోంది, ఒక పోలీస్ అధికారి అన్న మాటల్లో తప్పేముంది? దీనిపై వీధుల్లో రచ్చ చేశారు అని టి.నరసిపుర గొడవను ప్రస్తావించారు. బీజేపీ ప్రజలను రెచ్చగొట్టడానికి పనిచేస్తోందన్నారు. ఇక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, అది భారతదేశానికే సమస్య అవుతుంది, దేశం కోసం ప్రధాని కనే కలను దెబ్బతీయడానికి ఇక్కడి బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
వానలు రాకపోతే మరింత కష్టం
విద్యుత్ కొరత ఏర్పడింది
సీఎం డీకే శివకుమార్


