హుబ్లీ: ఇన్‌స్టా ఖాతాలో తల్వార్ పట్టుకొన్న వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన పాత హుబ్లీ ఈశ్వర్ నగర్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తల్వార్‌ను జప్తు చేశారు. గంగాధర్ మడివాళ నిందితుడు. ప్రజల్లో భయాందోళనలు కలిగేలా తల్వార్ పట్టుకున్న ఫోటోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కసబాపేటె పోలీసులు ఆయుధాల చట్టం ద్వారా కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ ఎస్‌జీ వడ్డర్ నేతృత్వంలో కార్యాచరణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
నలుగురు
పేకాటరాయుళ్ల అరెస్ట్
హుబ్లీ: ధార్వాడ జనతా నగర్ స్లం బోర్డులోని పేకాట అడ్డాపై దాడి చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతానికి చెందిన జకీర్, యాసిన్, అల్తాఫ్, సాదిక్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.12,030ల నగదుతో పాటు ఇతర వస్తువులను జప్తు చేశారు. విద్యాగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
బళ్లారిఅర్బన్: నగరంలోని పలు వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. 21వ వార్డులో హెచ్.లక్ష్మీకాంత్ ఇంటి వద్ద నుంచి 4వ క్రాస్ రోడ్డు వరకు రూ.90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 24వ వార్డు కప్పగల్ రోడ్డులో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టే 7వ క్రాస్ రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో హనుమాన్ నగర్‌లోని రమ్య లేఅవుట్ సమీపంలో 17, 18వ వార్డులను కలిపే పలు రోడ్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. చానాళ్ శేఖర్, వాసురెడ్డి, బండ్రాళ మృత్యుంజయ స్వామి తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల కొరతతో
విద్యా రంగం కుదేలు
రాయచూరు రూరల్: సర్కార్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యా రంగం కుదేలైందని రాష్ట్ర విద్యా సమితి అధ్యక్షుడు నిరంజనారాధ్య పేర్కొన్నారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం, ప్రభుత్వ పాఠశాల వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శూన్య ఉపాధ్యాయ పాఠశాలల్లో నియామకాలు లేకపోవడంతో విద్యా రంగం కుంటుపడిందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో దశాబ్ద కాలం నుంచి లక్షకు పైగా పాఠశాలను మూసి వేశారన్నారు. ఎస్డీఎంసీ అధ్యక్షుడు జయణ్ణ, రతన్ చౌహాన్, సిద్దప్ప, అలీనా జోసెఫ్, విరుపాక్షి, సిద్దరామయ్య, హఫీజుల్లా, విద్యాపాటిల్‌లున్నారు.
కనీస వేతనాలు అందించండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని వివిధ శాఖలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలకు తోడు సవరించిన వేతనాలను అందించాలని కాంట్రాక్ట్ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం ప్రధాన తపాలా అధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అయ్యాళప్ప మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించే విధంగా సర్కార్ చర్యలు చేపట్టి వారికి సక్రమంగా సౌకర్యాలు అందించాలని కోరుతూ రాష్ట్రపతికి తపాలా శాఖ కార్డుల మీద సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.


