సాక్షి,బళ్లారి: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బీజేపీ చేపట్టిన బళ్లారి చలో బీజేపీ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. పాదయాత్ర ముగింపు సమావేశానికి భారీ ఎత్తున జన సమీకరణ చేసి ముగించాలని బీజేపీ భావించిన నేపథ్యంలో బహిరంగ సభకు తొలుత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ పాదయాత్ర ముగింపు సమావేఽశానికి సెప్టెంబర్ 10న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. సమావేశాన్ని నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహిస్తామని అనుమతించాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా ఈ నెల 7న అధికారులకు దరఖాస్తు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహణకు మైదానంలో అనుమతి ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతల విన్నపానికి ఎట్టకేలకు జిల్లాధికారి ఓకే చెబుతూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం బీజేపీ పాదయాత్ర ముగింపు సమావేశం నిర్వహించే మున్సిపల్ హైస్కూల్ మైదానాన్ని గాలి జనార్దనరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు తదితరులు పరిశీలించారు. భారీ బహిరంగ సభ నేపథ్యంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతిపక్ష నేత ఆర్.అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, జగదీష్ శెట్టర్ తదితరులు పాల్గొంటారు.
కుడితినికి చేరిన పాదయాత్ర
సండూరు తాలూకాలోని దరోజీ నుంచి తిమ్మలాపుర మీదుగా కుడితిని వరకు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మాజీ మంత్రి బీ.శ్రీరాములు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తదితరులు జనంతో మమేకం అవుతూ ముందుకు సాగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా అడుగంటిందని, అవినీతి తారస్థాయికి చేరుకుందనేందుకు ఉదాహరణ వాల్మీకి అభివృద్ధి మండలిలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలే సాక్ష్యంగా నిలుస్తాయన్నారు.
పాదయాత్రలో పాల్గొన్న శ్రీరాములు, విజయేంద్ర తదితరులు
మున్సిపల్ మైదానాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి
రేపటితో విపక్ష పోరాటానికి ముగింపు
మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సభ


