కొత్త ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

కొత్త ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

Sep 9 2026 12:05 AM | Updated on Sep 9 2026 12:05 AM

హొసపేటె: జంబునాథహళ్లిలో నిర్మిస్తున్న కొత్త 300 పడకల జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రికి సంబంధించిన పనులు, వైద్య పరికరాల సరఫరా పురోగతిలో ఉన్నాయని, అక్టోబరు నెలలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ఆస్పత్రిని ప్రారంభిస్తామని అన్నారు. ఆస్పత్రి పనులు దాదాపుగా పూర్తయ్యాయని, 50 శాతానికి పైగా వైద్య పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన పరికరాలు, సామగ్రి వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రారంభోత్సవానికి ముందే ఆస్పత్రిని శుభ్రపరచాలని, వైద్య పరికరాలను అమర్చాలని, పరీక్షల ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. కేకేఆర్‌డీబీ గ్రాంటుతో కొత్త జిల్లా ఆస్పత్రికి అవసరమైన స్కానింగ్‌తో సహా వైద్య పరికరాలు, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కొత్త జిల్లా ఆస్పత్రికి అవసరమైన వైద్య సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్‌ టీ.లింగరాజు తెలిపారు. జిల్లా సర్జన్‌ డాక్టర్‌ ఎల్‌ఆర్‌.శంకర్‌ నాయక్‌, జిల్లా ఆర్‌సీహెచ్‌ అధికారి డాక్టర్‌ జంబయ్యతో పాటు వైద్య అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

మాతా శిశు ఆస్పత్రిలో ఆరా

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల ఒక నవజాత శిశువు మరణించిన ఘటనపై నగరంలోని 60 పడకల మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రిపై ప్రజలు, సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే గవియప్ప ఆకస్మికంగా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సమస్యలను పరిశీలించారు. ఆయన రోగులు, వారి బంధువులను కలిసి ఆస్పత్రిలో సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో నెలకొన్న గందరగోళంపై రోగులు ఎమ్మెల్యే ముందు తమ గోడును వెలిబుచ్చారు. హాజరైన ఆస్పత్రి వైద్యులకు రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement