ఈసారి వినూత్నంగా మైసూరు దసరా | - | Sakshi
Sakshi News home page

ఈసారి వినూత్నంగా మైసూరు దసరా

Aug 30 2026 4:43 AM | Updated on Aug 30 2026 4:43 AM

మైసూరు: రాష్ట్రంలో పట్టిపీడిస్తున్న కరువును సాకుగా చూపి, మైసూరు దసరాను నేను నిరాడంబరంగా నిర్వహించను. అయితే, ఈసారి విభిన్నంగా జరుపుతాం, దసరా ఊరేగింపు స్వరూపాన్నే మార్చేస్తాను.. అని సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. శనివారం మైసూరులో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఓవల్‌ గ్రౌండ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, మైసూరు దసరా చివరిరోజున జరిగే చరిత్రాత్మక జంబూసవారీ ఊరేగింపులో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ వంటి సైనిక దళాలు, కన్నడ నటీనటులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఎప్పుడూ జరిగే జానపద కళారూపాలకు ఇంక తావు లేదు, ఇప్పుడు, కాలం మారింది, కాబట్టి, మేము కూడా దసరా ఊరేగింపు స్వరూపాన్ని మారుస్తాము అని చెప్పారు. దసరాకు నూతన మెరుగులు దిద్దేందుకు ప్రణాళికను రూపొందించామని సీఎం తెలిపారు. సినిమా కళాకారులు, వివిధ సాంస్కృతిక బృందాలు ఒకే వేదికలో పాల్గొనేలా సూచించామన్నారు.

టూరిజానికి దసరా ఊతం

దసరా సంబరాలలో కంబళ నిర్వహించడంపై చర్చిస్తున్నాము. కంబళ వల్ల కాలుష్యం ఏర్పడుతుందని కొందరు వ్యతిరేకించడం సరి కాదని సీఎం అన్నారు. తగిన నిర్ణయం తీసుకుంటాను అని తెలిపారు. కరువు ఏర్పడిందనే నెపంతో దసరా ఉత్సవాలను సాదాసీదాగా జరిపేది లేదన్నారు. ఎందుకంటే మైసూరు పర్యాటకం దసరాపై ఆధారపడి ఉంది, అందుకే వైభవంగా ఉత్సవాలను జరుపుతామన్నారు. దసరా ఉత్సవాల ప్రారంభోత్సవ అతిథిగా ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మైసూరు చాలా పరిశుభ్రమైన నగరం, దానిని పరిరక్షించడం మన బాధ్యత. సిద్ధరామయ్య వాగ్దానం చేసిన గ్రేటర్‌ మైసూరును నెరవేర్చడం నా బాధ్యత అని చెప్పారు.

5 నగరాల అభివృద్ధి ప్రణాళిక

బెంగళూరు నగరంలో జనాభా, వాహన రద్దీ ఎక్కువైంది, ఆ ఒత్తిడిని తగ్గించేందుకు మైసూరు, బెళగావి, హుబ్లీ–ధార్వాడ, కలబుర్గితో పాటు 5 ప్రముఖ నగరాల్లో కొత్తగా ఉపాధి కల్పన, విద్యా, ఆరోగ్య, మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని సీఎం చెప్పారు. కావేరి జల వివాదంపై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడంతో పాటు రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు.

నిరపరాధి బలయ్యాడు

మంత్రి నాగేంద్ర రాజీనామాను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు నిరపరాధిని బలి తీసుకున్నాయని విమర్శించారు. నాగేంద్ర స్వచ్ఛందంగా రాజీనామా చేశారని, లేఖను గవర్నర్‌కు రాజీనామాను పంపించామని చెప్పారు. తాను సీఎం కావడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని డీకే మండిపడ్డారు. హెచ్‌డీ కుమారస్వామికి రాజకీయాలే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాదన్నారు. హనూరు ఎన్‌కౌంటర్‌పై నిష్పక్షపాత దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.

జంబూసవారీలో సైనిక కవాతు,

నటీనటుల ప్రదర్శన

కరువు సాకుతో ఉత్సవ శోభను

తగ్గించబోం

సీఎం డీకే శివకుమార్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement