● వెంకటేశ్వరస్వామి
ఆలయాల్లో భక్తసంద్రం
బొమ్మనహళ్లి: శ్రావణమాసం 3వ శనివారం సందర్భంగా నగరంలోని బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోని అగరలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు అనంతపురం చంద్రమౌళి ఆధ్వర్యంలో వేంకటేశ్వరుడు, భూదేవి, పద్మావతి దేవికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత వెండి కవచాలతో పాటు వివిధ పూలతో సుందరంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. వందలాది భక్తులు వైకుంఠవాసున్ని దర్శించుకొన్నారు.
గ్యారంటీలపై జాగృతి
మైసూరు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పంచ గ్యారంటీలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని జిల్లా గ్యారంటీ పథకాల అమలు సమితి అధ్యక్షుడు అరుణ్ కుమార్ అన్నారు. ఆయన మైసూరు తాలూకా గోపాలపుర గ్రామంలో శనివారం గ్యారంటీలపై జాగృతి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజల అభివృద్ధికి దోహదపడతాయన్నారు. వాటి వల్ల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భద్రత లభించిందన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. గురుస్వామి, నాగరాజ మూర్తి, రవి, మురుడప్ప, సురేష్, వెంకటప్ప, ఏడీ రుక్మాంగద, పీడీఓ ప్రదీప్ పాల్గొన్నారు.
ఆత్మీయ రక్షాబంధన్
తుమకూరు: సోదరభావాన్ని చాటే రక్షాబంధన్ పండుగను బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు శనివారం నగరంలో పలు చోట్ల సంబరంగా ఆచరించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని కలిసి వారికి రాఖీలు కట్టారు. అశోకనగర ఆజాద్ పార్కులో పౌర కార్మికులకు రాఖీలను కట్టి మిఠాయిలు తినిపించారు.
విద్యార్థుల బస్సుకు ప్రమాదం
శివమొగ్గ: జిల్లాలోని సాగర్ తాలూకాలోని కస్పాడి చెరువు గట్టు రైలింగ్‌ను శనివారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. సాగర్‌లో జరిగిన తాలూకా స్థాయి ప్రీ–యూనివర్సిటీ కళాశాల క్రీడా పోటీలలో పాల్గొని ఆనందపురకు తిరిగి వస్తున్న కేపీఎస్ ప్రీ–యూనివర్సిటీ కళాశాల విద్యార్థులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తు, బస్సులోని 48 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే 10 మంది విద్యార్థులు, ఒక అధ్యాపకునికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని శివమొగ్గలోని మెగ్గన్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. రైలింగ్ విరిగి బస్సు చెరువులో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ముప్పు తప్పడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు.
ఊళ్లలో చిరుత సంచారం
విజయపుర: విజయపుర హోబళి ఆవతి, భైరప్పనహళ్లి, హోసహుడ్య గ్రామ చుట్టుపక్కల చిరుతపులి సంచరిస్తోంది. కొన్నిరోజులుగా భైరప్పనహళ్లి, ఆవతి గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుత తిరుగుతుండడంతో ప్రజలు రాత్రయితే బయటకు రావాలంటే భయపడుతున్నారు. బైరప్పనహళ్లి గ్రామంలోని సీసీ కెమెరాలో చిరుత చిక్కింది. పొలాలకు వెళ్లేందుకు రైతులు అమ్మో అంటున్నారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు పరిశీలించి చిరుత పట్టివేతకు ఏర్పాట్లు చేస్తున్నారు.


