రిహార్సల్స్‌లో భాగంగా
సాహస క్రీడను ప్రదర్శిస్తున్న కమాండోలు
ప్రారంభిస్తున్న సీఎం శివకుమార్, హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే, ఎమ్మెల్యే హ్యారీస్
బనశంకరి: రాజధాని బెంగళూరు నగరంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసే దృష్టితో బెంగళూరులో ప్రత్యేక పోలీస్ స్క్వాడ్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. శుక్రవారం బెంగళూరు ఫీల్డ్‌మార్షల్ మాణిక్‌షా పరేడ్ మైదానంలో కర్ణాటక రాష్ట్ర పోలీస్ శాఖకు ఎన్‌ఎస్‌జీ భద్రతపై అందించే శిక్షణా కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించి మాట్లాడారు. పెచ్చుమీరుతున్న రౌడీయిజాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు ధైర్యంగా విధులు నిర్వహించాలని సలహా ఇచ్చారు. పోలీస్ సిబ్బంది సామర్థ్యం, నైపుణ్యత, కార్యవైఖరిని పెంచడం శిక్షణ ప్రధాన ఉద్దేశమన్నారు. భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై, బెంగళూరు ప్రజల భద్రత మరింత బలోపేతానికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారని తెలిపారు. అశాంతి, ఉగ్రవాదం నియంత్రణకు ప్రామాణికంగా పని చేయాలని పోలీసులకు పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌జీ శిక్షణతో పోలీసుల్లో సామర్థ్యం, వృత్తినైపుణ్యం పెరుగుతుందన్నారు. హోంమంత్రి ప్రియాంక్‌ఖర్గే, డీజీపీ ఎంఏ.సలీం, ఎమ్మెల్యే ఎన్‌ఏ.హ్యారీస్, నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


