పార్టీకి చెడ్డపేరు వద్దనే మంత్రి పదవికి రాజీనామా | - | Sakshi
Sakshi News home page

పార్టీకి చెడ్డపేరు వద్దనే మంత్రి పదవికి రాజీనామా

Aug 29 2026 1:22 AM | Updated on Aug 29 2026 1:22 AM

బనశంకరి: రాజ్యాంగ విలువలకు కట్టుబడి పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దనే తాను స్వచ్ఛందంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రణాళిక, గణాంక శాఖ మంత్రి నాగేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్న అనంతరం మంత్రి నాగేంద్ర విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం మాట్లాడారు. శాసనసభ సమావేశాలు సజావుగా నిర్వహించడానికి విపక్షాలు అవకాశం ఇవ్వకపోగా సభా సమయాన్ని వృథా చేశారని, ప్రతిపక్షాల వారు రాజ్యాంగ వ్యతిరేకులని మండిపడ్డారు. గతంలో కూడా తమ పార్టీకి ఇబ్బంది కలగరాదని తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. మొదటిసారి సీబీఐ తన పేరును చార్జిషీట్‌లో చేర్చలేదన్నారు. తాను మంత్రి అయిన తరువాత రెండో చార్జిషీట్‌లో పేరు చేర్చారన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

గవర్నర్‌ నుంచి ప్రాసిక్యూషన్‌ను స్వాగతిస్తా

కేసులపై విచారణకు గవర్నర్‌ నుంచి ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తుండటాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. బీజేపీ వారిపై ఉన్న కేసులపై కూడా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికలకు ఇదే విషయాన్ని అజెండాగా చేసుకుని వెళతానని అన్నారు. వాల్మీకి కుంభకోణంలో తన పాత్ర లేదన్నారు. న్యాయప్రక్రియకు గౌరవం ఇస్తానని అన్నారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాను. ప్రజాకోర్టులో అన్నింటిని ఎదుర్కోవాలని బీజేపీ నేతలు బీ.శ్రీరాములు, గాలి జనార్దనరెడ్డిలకు బహిరంగ సవాల్‌ విసిరారు. వాల్మీకి కుంభకోణం కేసులో నాగేంద్ర 2024లో మొదటిసారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2026 జూలైలో మళ్లీ కేబినెట్‌లో చేరి ప్రమాణస్వీకారం చేశారు. కానీ నాగేంద్రను కేబినెట్‌లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి విపక్షాలు అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర పోరాటం చేశాయి. ఈనేపథ్యంలో మంత్రి పదవికి నాగేంద్ర శుక్రవారం మరోసారి రాజీనామా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement