మైసూరు: ఈసారి అత్యంత వైభవంగా జరగనున్న ప్రపంచ ప్రసిద్ధ నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొనేందుకు అడవి నుంచి మైసూరు రాజభవనానికి చేరుకున్న జంబూ సవారీ ఏనుగుల మొదటి బృందం శుక్రవారం ప్రపంచ ప్రసిద్ధ అంబావిలాస్ ప్యాలెస్‌లోకి ప్రవేశించి అక్కడే బస చేసింది. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకా నాగరహొళె సమీపంలో ఉన్న వీరనహొసహళ్లి జాతీయ పార్క్ నుంచి గజపయనం ద్వారా మైసూరు ఫారెస్ట్ హౌస్‌కు చేరుకుని రెండు రోజులు బస చేసిన ఈ ఏనుగులకు శుక్రవారం అటవీ శాఖ అధికారులు స్వాగతం పలికారు. ఉదయం 7.45 గంటలకు ప్యాలెస్ పురోహితుడు ప్రహ్లాదరావు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఏనుగులకు పంచఫలాలు, కుడుములు, చక్కిలం, నిప్పట్టు, సైంధవ బెల్లం, ఓళిగ, బెల్లం, చెరకు, మోదక్ సమర్పించి ’షోడశోపచార’ పూజ నిర్వహించారు.
కనువిందుగా ఊరేగింపు
అనంతరం అక్కడి నుంచి ఊరేగింపుగా సాగనంపారు. ఆ తర్వాత పోలీసు, అటవీ శాఖ వారి కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజ వీధి గుండా ఠీవీగా సాగుతున్న ఊరేగింపును వీక్షించేందుకు ప్రజలు రోడ్ల పక్కన గుమిగూడారు. ధనంజయ, మహేంద్ర, ఏకలవ్య, ప్రశాంత్, గోపి, శ్రీరాం, శ్రీకాంత్ అనే మగ ఏనుగులను, లక్ష్మి, కావేరి అనే ఆడ ఏనుగులను తమ కళ్లెదుటే కదులుతుండటాన్ని చూసి వారు తమ మొబైల్ ఫోన్లలో ఏనుగుల నడక చిత్రాలను క్లిక్ చేస్తూ ఆనందించారు. చివరకు అవి ప్రదర్శన మైదానానికి ఎదురుగా ఉన్న అంబావిలాస్ ప్యాలెస్‌లోని జయమార్తాండ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు ప్యాలెస్ యాజమాన్యం వాటికి సాంప్రదాయబద్ధంగా పూలమాలలు వేసింది.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు
అంబావిలాస్ ప్యాలెస్‌కు చేరుకుంటున్న గజరాజులు
ఏనుగులకు పూజలు
అటవీ శాఖ మంత్రి రామలింగారెడ్డి పూజలు నిర్వహించారు. ఆయన వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య ఉన్నారు. ఎమ్మెల్యేలు టీ.ఎస్.శ్రీవత్స, కె.హరీష్ గౌడ, విధాన పరిషత్ సభ్యుడు సీ.ఎన్.మంజేగౌడ, జిల్లా మేజిస్ట్రేట్ జీ. లక్ష్మణ అతారెడ్డి, జెడ్పీ సీఈఓ ఎస్.యుకేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. అనంతరం నాదస్వర, జానపద కళా బృందాల మనోహరమైన ప్రదర్శనతో ఏనుగులను రాజభవనం ముందు భాగానికి తీసుకువచ్చి వరుసలో నిలబెట్టారు. అక్కడ మావటీల కుటుంబాలకు, కావడీలకు నిత్యావసర వస్తువులున్న కిట్లను పంపిణీ చేశారు. అనంతరం మావటీలు, కావడీలు ఏనుగులను వాటి కోసం నిర్మించిన తాత్కాలిక షెడ్లకు తీసుకువెళ్లి అక్కడ వదిలిపెట్టారు. అవి వాటికి ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లలో బస చేశాయి.
సంప్రదాయ పద్ధతిలో పూజలతో
ఘన స్వాగతం
ఏనుగుల వీక్షణ కోసం ఎగబడిన
నగర వాసులు


