రాజధాని గడ్డ.. వలసదారుల అడ్డా | - | Sakshi
Sakshi News home page

రాజధాని గడ్డ.. వలసదారుల అడ్డా

Aug 29 2026 1:22 AM | Updated on Aug 29 2026 1:22 AM

సాక్షి బెంగళూరు: ప్రస్తుతం అక్రమ వలసల సమస్య ప్రపంచ వ్యాప్తంగానే కాక మనదేశంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భద్రత, ఉపాధి, జనాభా సమతుల్యత వంటి అంశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అక్రమ వలసదారుల సమస్య కర్ణాటకను ఎక్కువగా వేధిస్తోంది. అక్రమ వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో వివరాలు ఆరా తీస్తున్న అధికారులకు విస్తుబోయే విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐటీసిటీ బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య అధికారికంగా వందల్లోనే ఉంది. గడిచిన మూడేళ్లలో 911 మంది అక్రమ వలసదారులను అధికారులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెడుతోంది.

వలసదారులపై కఠిన వైఖరి

అక్రమంగా ఉంటున్న విదేశీయులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో వీసా గడువు ముగిసినా అక్రమంగా విదేశీయులు ఇక్కడే ఉంటున్నట్లు రాష్ట్ర హోం శాఖ వెల్లడించింది. నగరంలో ప్రస్తుతం అధికారికంగా వీసా, పాస్‌పోర్టు కలిగిన విదేశీయులు మొత్తం 5,304 మంది ఉన్నారు. ఇదే సమయంలో వీసా గడువు ముగిసినా కూడా అక్రమంగా 446 మంది ఉంటున్నట్లు హోం మంత్రి ప్రియాంక్‌ ఖర్గే విధాన పరిషత్‌లో అధికారిక లెక్కలు వెల్లడించారు. దేశంలోకి అక్రమంగా చొరబడి కర్ణాటకలో నివసిస్తున్న విదేశీయుల సంఖ్యపై మాత్రం కచ్చితమైన సమాచారం లేదని హోం శాఖ తెలిపింది. గడిచిన మూడేళ్లలో రాష్ట్ర పోలీసు శాఖ మొత్తం 911 మంది అక్రమ వలసదారులను గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం 31 దేశాలకు చెందిన 365 మంది విదేశీయులు వివిధ నేరాల్లో పాలుపంచుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

మూటాముల్లెతో వలస వ స్తున్న బంగ్లాదేశీయులు

పిల్లాపాపలతో వలస వచ్చిన నైజీరియన్లు

నేరాల్లో నైజీరియన్లదే పైచేయి

నేరాల్లో ఎక్కువగా నైజీరియాకు చెందిన వ్యక్తులదే పైచేయిగా ఉంది. నైజీరియాకు చెందిన 135 మంది, బంగ్లాదేశ్‌కు చెందిన 48 మంది, నేపాల్‌కు చెందిన 44 మంది, పాకిస్తాన్‌కు చెందిన 20 మంది, ఐవరీ కోస్టు, ఉగాండాకు చెందిన చెరో 13 మంది వివిధ నేరాలకు పాల్పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఇక్కడ నివసిస్తున్న విదేశీయులను గుర్తించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా పోలీసు విభాగాలు తనిఖీలు చేస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించిన తర్వాత వారి సమాచారాన్ని డీపీఎం (డిస్ట్రిక్ట్‌ పోలీసు మాడ్యూల్‌), ఎఫ్‌ఐపీ (ఫారినర్స్‌ ఐడెంటిఫికేషన్‌ పోర్టల్‌)లో నమోదు చేస్తున్నారు. అనంతరం న్యాయ ప్రక్రియ ద్వారా వారిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్రమంగా ఉంటున్న విదేశీయులను వారి వివరాలతో విదేశీయుల రిజిస్టర్‌ కార్యాలయ అధికారులు ముందు హాజరు పరుస్తున్నారు.

మూడేళ్లలో 911 మంది అక్రమ వలసదారుల రాక

వీసా గడువు ముగిసినా

తిరిగి వెళ్లని వైనం

బెంగళూరులో 446 మంది

విదేశీయుల బస

నేరాల్లో పాలుపంచుకుంటున్న

చొరబాటుదార్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement