శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో రోజూ అలజడిగా మారిన మహర్షి వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలిలో వందల కోట్ల రూపాయల దుర్వినియోగం కేసులో రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ మంత్రి బీ.నాగేంద్రకు ఇంటా బయటా ఎదురుగాలి తగులుతోంది. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ అసెంబ్లీలో రోజూ రభస చేస్తుండడం తెలిసిందే. ఇంతలో ఈ కేసులో నాగేంద్రపై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు లేఖ రాయడంతో కాంగ్రెస్ సర్కారుకు కూడా ఇబ్బందికరంగా మారింది.
అనుమతి ఇస్తారా?
వాల్మీకి కార్పొరేషన్ నిధులను స్వాహా చేసి ఇతర రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు ఉపయోగించారని, ఇందులో నాగేంద్రను లోతుగా విచారించాలి, ఆయన మంత్రి కాబట్టి మీ అనుమతి కావాలి అని సీబీఐ గవర్నర్‌కు విన్నవించింది. సీబీఐ వినతికి గవర్నర్ పచ్చజెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే నాగేంద్ర చిక్కులను ఎదుర్కోవడం ఖాయం. వారం క్రితమే సీబీఐ లోక్‌భవన్‌కు లేఖ రాసింది. ఈ లేఖను తీవ్రంగా పరిగణించిన గవర్నర్, కర్తవ్య పాలనపై న్యాయ, రాజ్యాంగ నిపుణుల సలహా తీసుకున్నారు. న్యాయ నిపుణులు సూచనలు చేశారని తెలిసింది.
సీబీఐ ఎంట్రీపై అధికార కాంగ్రెస్‌లో ఆందోళన
గవర్నర్ వైపు అందరి చూపు
గతంలో సిద్దుకు ఆమోదం
గతంలో సంచలనాత్మక మైసూరు ముడా ఇళ్ల స్థలాల కేసులో అప్పటి సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం తెలిసిందే. కాబట్టి నాగేంద్రకు ఆయన మినహాయింపు ఇస్తారా? అనేది సందేహమేనని సీనియర్ నాయకులు చెబుతున్నారు. నాగేంద్ర దిగిపోవాలంటూ వచ్చే వారం జగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్రను ప్రారంభించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. నాగేంద్రకు ఏ రకంగా మద్దతుగా నిలవాలి అనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది. బంతి గవర్నర్ మైదానంలో ఉండగా, అంపైర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
మంత్రి బి.నాగేంద్ర విచారణకు
అనుమతించాలని సీబీఐ లేఖ
న్యాయ నిపుణులతో గెహ్లాట్ చర్చలు
త్వరలో తేల్చేసే అవకాశం
కాంగ్రెస్ సర్కారుకు చిక్కులు?
ఎందుకు అనుమతి కోరిందో?: హోంమంత్రి
శివాజీనగర: మంత్రి నాగేంద్రపై విచారణకు గవర్నర్‌ను సీబీఐ అనుమతి కోరడంపై హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు అంశాల గురించి మంత్రి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. వాల్మీకి కుంభకోణం కేసులో నాగేంద్ర విచారణకు సీబీఐ ఏ ప్రాతిపదికన అనుమతి కోరిందో నాకు తెలియదన్నారు. ఏదైనా గానీ సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని సూచించారు. దీనిపై సీబీఐ నుంచి ఏ లేఖ తమకు అందలేదన్నారు. సీబీఐ నుంచి గవర్నర్‌కు లేఖ ఇచ్చిందో లేదో తెలియదని ఆయన అన్నారు. రాయచూరు జిల్లాలో యువతి హత్య ఘటన తీవ్రమైనదని, చట్టం కళ్లనుంచి ఎవరు తప్పించుకోలేరన్నారు. కేపీఎస్‌సీ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్‌ను తొలగించాలని గవర్నర్ గతంలోనే ఆదేశించారు, ప్రభుత్వం కూడా ఆమోదించిందని తెలిపారు. ఠాణాలలో సీసీ కెమెరాల సాంకేతిక లోపాలను సరిదిద్దుతామని చెప్పారు.


