● చక్కెర, బెల్లం ధరల మంట
బనశంకరి: రాష్ట్రంలో పండుగల సీజన్ వస్తుండగా, బెల్లం, చక్కెర ధర ఆకస్మాత్తుగా పెరిగింది. కేజీ చక్కెర రూ.50 నుంచి 55 ఉండగా, ఇప్పుడు రూ.70 నుంచి 75కు ఎగబాకింది. పెట్రోలులో కలిపే ఎథనాల్ ఉత్పత్తికి కంపెనీలు భారీగా చెరకు, చక్కెరను వాడుతుండటం దేశీయ మార్కెట్‌లో కొరతకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో చక్కెర ధర 40 శాతం పెరిగినట్లు తెలిపారు. బెల్లం కూడా అదే దారిలో ఉంది.
బెల్లం ఉత్పత్తి క్షీణత
చెరకు కొరత వల్ల గానుగల్లో బెల్లం ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. గతంలో క్వింటాల్ బెల్లం రూ.4,500 ఉండగా రెండు మూడు రోజుల్లో రూ.2,000 పెరిగి రూ.6,500 నుంచి రూ.7 వేలకు చేరుకుంది. బెల్లం చరిత్రలో ఈ స్థాయిలో ధర పెరగడం ఇదే మొదటిసారని వర్తకులు తెలిపారు. కొనుగోలుదారులతో పాటు వ్యాపారులు కూడా అంత ధర పెట్టి సరుకు కొనలేక కంగారుపడుతున్నారు. వినాయకచవితి, దసరా పండుగలకు కుడుములు, ఓళిగలు సహా అన్ని రకాల మిఠాయిలకు ఈ రెండు చాలా ముఖ్యమన్నది తెలిసిందే. పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మునుముందు నూనెలు, పప్పు దినుసుల ధరలూ పెరగవచ్చని వాణిజ్య వర్గాలు పేర్కొన్నాయి.
తెగిన తీగ.. ఆగిన రైళ్లు
మండ్య: విద్యుత్ తీగ తెగిపడడంతో బెంగళూరు–మైసూరు మధ్య రైలు రాకపోకలు 3 గంటలు ఆలస్యంగా సాగాయి. యలియూరు రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం 11 గంటలప్పుడు విద్యుత్ తీగ తెగిపడడంతో హఠాత్తుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వందేభారత్, మైసూరు–చైన్నె ఎక్స్‌ప్రెస్, మైసూరు–ముంబై ఎక్స్‌ప్రెస్, మైసూరు–కాకినాడ తదితర రైళ్లు ఉన్నపళంగా నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి రైలు సర్వీసులు మొదలయ్యాయి.
ఉప్మాలో బల్లి, ఆస్పత్రిలో బాలలు
దొడ్డబళ్లాపురం: పాఠశాలలో టిఫిన్ ఉప్మాలో బల్లి పడడంతో అది తిన్న వందమందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన గదగ్ జిల్లా ముండరగి తాలూకా బీడనాళ గ్రామంలో జరిగింది. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం ఉప్మా వండారు. అందులో బల్లి పడిపోయింది. ఆ విషయం తెలియక బాలలకు వడ్డించారు. కొంతసేపటికే వారికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. బిసి ఊట సిబ్బంది ఉప్మాను పరిశీలించగా చచ్చిన బల్లి కనిపించింది. బాలలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పరుగు పరుగున ఆస్పత్రికి వచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.
నీటి విడుదలపై నిరసన
మండ్య: తమిళనాడుకు రోజూ 12 వేల క్యూసెక్కుల కావేరి నీటిని వదలడాన్ని ఖండిస్తూ రైతు, ప్రజా సంఘాల కార్యకర్తలు మండ్య జయచామరాజేంద్ర ఒడెయార్ సర్కిల్‌లో ధర్నా చేశారు. తమిళనాడు, సీడబ్ల్యూఆర్‌సీ, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగళూరు–మైసూరు హైవేలో బైఠాయించారు. కావేరి వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నా తమిళనాడుకు నీరివ్వడం సరికాదని అన్నారు.
ఖాళీ అవుతున్న కబిని
మైసూరు: జిల్లాలోని హెచ్‌డీ కోటె తాలూకా బీచనహళ్లి సమీపంలోని కబిని డ్యాం తమిళనాడుకు నిత్యం టీఎంసీ నీటిని వదులుతున్నారు. డ్యాంలో నీటిమట్టం బాగా పడిపోయింది. కేరళలోని వయనాడు, పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో వర్షాలు కూడా నిలిచిపోయాయి. నీరు వెళ్తోంది కానీ ఆ స్థాయిలో చేరడం లేదు. మరికొన్ని రోజుల్లో ఖాళీ కావచ్చని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.


