కాలువలకు నీరు వదలాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

కాలువలకు నీరు వదలాలని ధర్నా

Aug 23 2026 1:16 AM | Updated on Aug 23 2026 1:16 AM

రాయచూరు రూరల్‌: తుంగభద్ర డ్యాం నుంచి రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని కాలువలకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. శనివారం సిరవార నీటిపారుదల శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్‌ మాట్లాడారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి శివకుమార్‌కు విన్నవించినట్లు తెలిపారు. రాయచూరు జిల్లాలోని మాన్వి, సిరవార తాలూకాలకు నీటిని విడుదల చేయాలన్నారు. డ్యాం నిండుతున్నా ఆయకట్టులోని రైతులను పంటలు పండించుకోవద్దని చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల నుంచి ఒత్తిడి ఉందని ఆరోపించారు. రెండేళ్ల కిందటే క్రస్ట్‌గేట్లు తొలగించాలని తెలిసినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడాది పాటు రెండు పంటలను రైతులు పండించుకోలేని పరిస్థితిని తెచ్చి పెట్టారని దుయ్యబట్టారు. కాలువలకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఇంజనీర్‌కు వినతిపత్రం సమర్పించారు.

బాలికపై లైంగిక దాడి కేసులో ఏడుగురి అరెస్ట్‌

సాక్షి,బళ్లారి: మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్లు కొప్పళ జిల్లా ఎస్పీ రాం అరసిద్ధి తెలిపారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గత ఏడాది అక్టోబర్‌ 10వ తేదీన జరిగింది. కొప్పళ జిల్లాలోని ఓ గ్రామంలో హైస్కూలు చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిందని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏడాది క్రితం తన కుమార్తెను బస్టాండు నుంచి బైక్‌పై హర్ష అనే యవకుడు తీసుకెళ్లి, మత్తు పదార్ధం తాగించి అత్యాచారం చేసినట్లు తెలిపింది. తీసిన వీడియోను అనంతరం బాలిక మొబైల్‌కు పంపించి తన లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు సహకరించాలని వాట్సాప్‌ కాల్‌ చేస్తూ సంభాషించేవాడని ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితులకు కూడా పంపడంతో ఆ వీడియోను కొందరి మొబైల్‌కు షేర్‌ చేయడంతో ఈ ఘటనలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి, అందుకు సహకరించిన మరొక వ్యక్తి కిరణ్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసిన వారు కలిపి మొత్తం ఏడు మందిని కొప్పళ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

విద్యుత్‌ గ్రిడ్‌లో చోరీ

హుబ్లీ: పాత హుబ్లీ కార్వార రోడ్డు బిడ్నాళలో కేఈబీ గ్రిడ్‌ లోపల ఉన్న కేపీటీసీఎల్‌ 220 కేవీ స్వీకరణ కేంద్రంలో రూ.1.80 లక్షల విలువ చేసే 270 కేజీల 27 ఎర్త్‌స్విచ్‌ రాడ్డు, 180 కేజీల మెయిల్‌ కాంట్రాక్ట్‌ రాడ్లను చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏప్రిల్‌ 12 నుంచి జూలై 12 మధ్య ఉన్న గడువులో సదరు కేంద్రం–1 2, సిరసి–1, 2, నరేంద్ర–1, 2, నాగ్జరి– 1, 2, 3లో అమర్చిన ఎర్త్‌స్విచ్‌ రాడ్లు, మెయిన్‌ కాంటాక్ట్‌ రాడ్లను చోరీ చేశారని కార్తీక్‌ కబ్బూర పాత హుబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

35 గేదె దూడల రక్షణ

కాగా మరో ఘటనలో కసాయిఖానాకు తరలిస్తున్న 35 గేదె దూడలను రక్షించారు. హుబ్లీ గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుందగోళ క్రాస్‌ వద్ద లారీలో గేదె దూడలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి సదరు దూడలను కాపాడారు. లారీ డ్రైవర్‌ బెళగావికి చెందిన దస్తగిరి, క్లీనర్‌ అల్తాఫ్‌లపై పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఘనంగా

వరమహాలక్ష్మి వ్రతం

హొసపేటె: నగర, గ్రామీణ ప్రాంతాల్లో వరమహాలక్ష్మి పూజను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి వ్రతంలో భాగంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. తెల్లవారు జామున ఇంట్లో అందమైన మండపాన్ని నిర్మించి లక్ష్మిదేవిని కూర్చోబెట్టారు. వరమహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని రకరకాల రంగుల కొత్త బట్టలు, ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజించారు. ప్రత్యేక పూజ, మంగళ హారతి నిర్వహించారు. ఆనందం, సంపద, కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే పవిత్ర పండుగగా భావించే వరమహాలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. పూజల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు. ఇల్లంతా భక్తి వేడుక, పండుగ వాతావరణం నిండింది.

గుండెపోటుతో కార్మికుడు మృతి

మైసూరు: చామరాజ నగర జిల్లా కొళ్లేగాల తాలూకా అగర–మాంబళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో తమిళనాడుకు చెందిన బూతలపుర నివాసి జడెరుద్ర (40) అనే కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. ఇతడు కుంతూరు చక్కెర కర్మాగారం సమీపంలో ఉన్న హోటల్‌లో పని చేసే వాడు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement