రాయచూరు రూరల్: గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ఏఐటీయూసీఐ డిమాండ్ చేసింది. మంగళవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, ఇతరత్ర సౌకర్యాలు సక్రమంగా అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
హొసపేటెను వణికించిన వర్షం
● భారీ వర్షానికి జలమయంగా రోడ్లు
హొసపేటె: నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. వర్షానికి నగరంలో ప్రముఖ రహదారులు వాన నీటితో జలమయంగా మారాయి. నగరంలోని విజయనగర కాలేజీ రోడ్డు, టీబీ డ్యాం రోడ్డు, బళ్లారి రోడ్డు, బస్టాండ్ రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, హంపీ రోడ్డుతో పాటు ప్రముఖ రహదారుల్లో వర్షం నీరు నిలిచాయి. రోడ్లలో వర్షం నీరు భారీగా చేరడంతో వాహనదారులు, పాదచారులకు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పథకాలు లబ్ధిదారుల దరి చేర్చాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను లబ్ధిదారుల దరి చేర్చాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాయచూరు తాలూకా శాఖావాది, సగమకుంట గ్రామాల్లో పర్యటించారు. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, నీటిపారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. తాగునీటి ఎద్దడి నివారించి రక్షిత నీటిని అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ వీబీజీ రాంజీ పథకం లబ్ధి పొందాలన్నారు.
మద్యం మత్తులో స్వామీజీ
రాయచూరు రూరల్ : హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న స్వామీజీ మద్యం మత్తులో తూలుతూ, పాటలు పాడుతూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాటలు పాడుతున్న వీడియో వైరల్ అయింది. అఫ్జల్‌పుర తాలూకా మాశ్యాల సిద్దలింగేశ్వర మఠాధిపతి మరుళారాధ్య స్వామీజీ సినిమా పాటలు పాడుతూ సంభ్రమానికి తెర లేపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గతంలో పెన్నుకు బదులు కత్తి ఇవ్వాలని పిలుపునిచ్చారు.
శ్రీవారి కళ్యాణానికి శ్రీకారం
రాయచూరు రూరల్: నగరంలో నాలుగు రోజుల పాటు జరిగే శ్రీవారి కళ్యాణోత్సవం ప్రారంభమైంది. మంగళవారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో వెలసిన వేంకటేఽశ్వర స్వామి పవిత్రోత్సవ సేవలకు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేంద్రరెడ్డి దంపతుల పట్టు వస్త్రాలతో ఆలయానికి వచ్చి శ్రీకారం చుట్టారు. ఉదయం సుప్రభాత సేవలు, పరిమళ ఆరాధన, కోయిల్ ఆళ్వార తిరుమంజనం వంటి సేవలను నెరవేర్చారు.
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రభుత్వ ఏకలవ్య గురుకుల సాంఘీక సంక్షేమ శాఖ ఆధీనంలోని హాస్టళ్లను జిల్లాధికారిణి పూవిత ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం రాత్రి దేవదుర్గ తాలూకాలో హాస్టల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్, వార్డెన్ల పని తీరును విచారించారు. ఇటీవల సింధనూరు హాస్టల్‌లో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఆమె తనిఖీ చేశారు. గుడ్డు, అరటిపండ్లు, ఆహార పదార్థాలు, దుస్తులు, మౌలిక సౌకర్యాలు, వంట గది శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు.


