రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో వ్యవసాయంపై రైతులకు శాస్త్రవేత్తలు సలహా, సూచనలివ్వాలని కలబుర్గి వ్యవసాయ వర్సిటీ ప్రత్యేక అధికారి శశికాంత్ పిలుపునిచ్చారు. మంగళవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో అమెరికాను మించి భారత్ ఆహార పదార్థాల ఉత్పత్తిలో ముందంజలో నిలవాలన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవాలన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాల గురించి విద్యార్థులకు వివరించాలన్నారు. సభ్యురాలు రేణుక, అధికారులు శ్రీనివాస్, అమరేగౌడ, కురుబర్, జగ్జీవన్ రాం, ప్రకాష్‌లున్నారు.
పశువుల చౌర్యం అడ్డగింత
హొసపేటె: రాత్రిపూట గ్రామంలోకి ప్రవేశించి పశువులను దొంగలిస్తున్న దొంగలను గ్రామస్తులు అడ్డుకున్న ఘటన సోమవారం రాత్రి విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా దిబ్బదహళ్లి గ్రామంలో జరిగింది. రాత్రి పూట గుర్తు తెలియని దొంగలు పశువులను దొంగలించి తమ వాహనాల్లో తరలించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామస్తులు గట్టిగా కేకలు పెట్టడంతో పాటు వారిపైకి రాళ్లు విసిరారు. దీంతో దొంగలు పశువులతో సహా వాహనాన్ని వదిలి పారిపోయారు. గ్రామస్తులు రాళ్లు విసరడంతో పశువుల దొంగలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా దిబ్బదహళ్లి, కక్కుప్పితో సహా చుట్టుపక్కల గ్రామాల్లో దొంగలు పశువులను దొంగిలిస్తున్నారు. కూడ్లిగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.
జీపీ ఉద్యోగుల ఆందోళన
బళ్లారిఅర్బన్: జీపీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర జీపీ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ కుమార్ మాట్లాడుతూ గత 7–8 ఏళ్లుగా వేతన సవరణ లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం 2026 మే 22న జారీ చేసిన వేతన సవరణ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల 13 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం.వీరసేనా రెడ్డి, జిల్లా కోశాధికారి ఎం.వెంకట సుబ్బారెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించారు. జీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా, తాలూకా పదాధికారులు, సభ్యులు పాల్గొన్నారు.
నేత్రపర్వం.. కల్మల కరియప్ప రథోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా కల్మలలో వెలసిన కరియప్ప తాత జాతర, రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. నాగ పంచమి సందర్భంగా సోమవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. గ్రామీణ శాసన సభ్యుడు బసన గౌడ దద్దల్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


