శివాజీనగర: ఓ వైపు మంత్రిమండలి విస్తరణ రగిల్చిన చిచ్చు అలా ఉండగానే, మరోవైపు విధాన పరిషత్ అధ్యక్ష స్థానాన్ని కై వసం చేసుకోవడానికి సీఎం డీకే శివకుమార్ పావులు వేస్తున్నారు. తీవ్ర ఒత్తిళ్లతో పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారు. రాబోయే వర్షకాల సమావేశాల రెండో రోజున డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయన తప్పుకుంటారని తెలిసింది. ఆగస్టు 14న పరిషత్ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఆయన వారంరోజులే కుర్చీలో ఉండొచ్చు.
కొందరు మంత్రులు వారించినా..
బసవరాజ్ హొరట్టికి కాంగ్రెస్ సీనియర్ మంత్రులు సతీష్ జార్కిహొళి, ఎన్.చెలువరాయస్వామి, జమీర్ అహ్మద్ ఖాన్, యూ.టీ.ఖాదర్, ఎమ్మెల్యే ఎన్.ఏ.హ్యారిస్ మద్దతుగా నిలవడం విశేషం. సీనియర్ నాయకుడైన హొరట్టి అనుభవం అవసరమని వారు తెలిపారు. కానీ మంత్రులు కోరినప్పటికీ డీకే వెనక్కి తగ్గలేదు. పార్టీ హైకమాండ్, సీనియర్లు తీసుకున్న నిర్ణయాన్ని మార్చలేమని సీఎం స్పష్టం చేసి, నిష్క్రమించాలని హొరట్టికి సూచించినట్లు సమాచారం. ఇందుకు హొరట్టి అయిష్టంగానే అంగీకరించారు.
హొరట్టితో మంతనాలు
హొరట్టితో కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్ గురువారం చర్చలు జరిపారు. రాజీనామా కోసం ఒప్పించేందుకు కలిశారు. కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నందున పదవిని వదిలిపెట్టాలని కోరారు. హొరట్టి రాజీనామా చేయకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కాంగ్రెస్ నేతలు కొందరు హెచ్చరించారు.
సలీం అహ్మద్, ఉమాశ్రీకి పగ్గాలు
పరిషత్‌కు కొత్త స్పీకర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. సలీం అహ్మద్ చైర్మన్‌గా, ఉమాశ్రీని డిప్యూటీ చైర్మన్‌గా ఆమోదించింది. 14న ఎన్నికలు జరుపుతారు, అభ్యర్థులు ఎన్నికైన వెంటనే హొరట్టి రాజీనామా ప్రకటిస్తారు.
1980 నుంచి ఎమ్మెల్సీగా..
హొరట్టి సొంతూరు బాగల్‌కోట జిల్లా. 1980లో టీచర్ ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన రాష్ట్రంలో సీనియర్ ఎమ్మెల్సీ. 8 సార్లు ఆ పదవికి ఎన్నికవుతూ వచ్చారు. జేడీఎస్‌లో ఉంటూ బీజేపీలో చేరారు. ఆ కూటమి మద్దతుతో హొరట్టి కొనసాగుతున్నారు.
తప్పుకోవాలని సభాపతి బసవరాజ
హొరట్టిపై తీవ్ర ఒత్తిడి
తలొగ్గిన హొరట్టి.. 14న రాజీనామా?
సీఎం డీకే శివ మంత్రాంగం
కాంగ్రెస్ నుంచి సభాపతి, డిప్యూటీ సిద్ధం
చిక్కకు అన్యాయమా?
బొమ్మనహళ్లి: చిక్కమగళూరు జిల్లాకు మంత్రి పదవిని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ నాయకులు బుధవారం రాత్రి తరికెరి పట్టణంలో కాగడాల ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే జి.హెచ్. శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు. జిల్లా ప్రజల కోరికను హైకమాండ్ పట్టించుకోవాలన్నారు. ఇందిరాగాంధీకి రాజకీయ పునర్జన్మనిచ్చిన నేలకు మంత్రి పోస్టు ఇవ్వాలి. చిక్కమగళూరు జిల్లాకు అన్యాయం చేయవద్దు అని నినాదాలు చేశారు.


