బొమ్మనహళ్లి: ఓ ఐటీ ఇంజనీరు మద్యం మత్తులో ఎయిర్‌గన్ తీసుకుని చాలాసేపు కాల్పులు జరిపాడు. బెంగళూరు వద్ద ఆనేకల్ తాలూకాలోని బండాపూర్ సమీపంలో ఉన్న సిపానీ అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన జరిగింది. యూపీలోని లక్నోకు చెందిన అనురాగ్ తివారీ (40)గా గుర్తించారు. పోలీసులు అతన్ని కటకటాలకు తరలించారు.
45 నిమిషాలు కాల్పులు
అనురాగ్ తివారీ వైట్‌ఫీల్డ్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. 8 నెలలుగా సిపానీ అపార్ట్‌మెంట్‌లోని 3వ అంతస్తులోని ఫ్లాటులో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి బాగా మద్యం తాగిన అతడు.. ఫోన్‌లో మాట్లాడుతూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ తర్వాత తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు, అతను బాల్కనీలోకి వచ్చి, ఎయిర్‌గన్‌తో పార్కింగ్ షెడ్‌పై కాల్చసాగాడు. శబ్దం విని అక్కడికి వచ్చిన సెక్యూరిటీ గార్డులపై కూడా కాల్పులు జరిపాడు. అతను సుమారు 45 నిమిషాల పాటు ఉన్మాదిగా మారి కాల్పులు జరుపుతూ భయాందోళనలు సృష్టించాడు. ఓ కారు అద్దాలు పగిలిపోయాయి. ఎవరికీ గాయాలు కాలేదు.
అరెస్టు, విచారణ
కారు యజమాని మాట్లాడుతూ స్థానిక సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పాడు. పోలీసులు, క్లూస్ టీం చేరుకుని తనిఖీలు చేశారు. నిందితుడు అనురాగ్ తివారీని నిర్బంధించి వివరాలు రాబడుతున్నారు. ఎయిర్ గన్‌ను, తూటాలను సేకరించారు. కాల్పులతో అపార్టుమెంటులోని జనం భీతావహులయ్యారు.
మద్యం మత్తులో టెక్కీ ఉన్మాద చేష్టలు
ఆనేకల్‌లో అపార్టుమెంటులో ఘటన
కటకటాల్లోకి నిందితుడు


