నగల షాపులో కాల్పులు, దోపిడీ యత్నం | - | Sakshi
Sakshi News home page

నగల షాపులో కాల్పులు, దోపిడీ యత్నం

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

దాబస్‌పేటలో కలకలం

దొడ్డబళ్లాపురం: కొనుగోలుదారుల్లా నగల షాప్‌కు వచ్చిన దుండగులు యజమానిపై తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన నెలమంగల తాలూకా దాబస్‌పేటలో జరిగింది. వివరాలు.. గురువారం దాబస్‌పేటలోని ప్రేమ్‌ శివ జ్యువెలరీకి బొలెరో వాహనంలో 6 మంది వచ్చారు. నగలు కొంటామని మాట్లాడుతూ, తుపాకీ తీసి దోపిడీకి యత్నించారు. యజమాని పున్నారాం అడ్డుకోగా నాటు పిస్టల్‌తో కాల్పులు జరిపి పరారయ్యారు. బుల్లెట్‌ కాలికి తగలడంతో పున్నారాం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడు ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరీక్షించగా, రెండు పేలని తూటాలు లభించాయి. సీసీ కెమెరా చిత్రాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఉత్తరాది ముఠాలే పాల్పడి ఉంటాయని అనుమానాలున్నాయి.

ఆర్టీసీ బస్సు బీభత్సం

బాలిక, తండ్రి, మరొకరు మృతి

బాలునికి తీవ్రగాయాలు

బెళగావి జిల్లాలో ఘోరం

దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో బాలిక సహా ముగ్గురు మృతిచెందిన సంఘటన బెళగావి జిల్లా గోకాక్‌ తాలూకా కొణ్ణూరు పట్టణంలో జరిగింది. సైఫ్‌ ముల్లా (29), కుమార్తె సిజా (4), స్నేహితుడు ఇంతియాజ్‌ (35) మృతులు. సిహాన్‌ షారుఖ్‌ (4) అనే బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం గోకాక్‌ ఫాల్స్‌ ఫోర్బ్‌ స్కూల్‌ నుంచి సైఫ్‌, ఇంతియాజ్‌లు తమ పిల్లలను బైక్‌లో తీసుకుని ఇళ్లకు వెళ్తున్నారు. వారి వెనుకే గోకాక్‌ వైపు వెళ్తున్న కేఎస్‌ ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్తూ బైక్‌ను ఢీకొని దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడ్డ సిహాన్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వెంటనే డ్రైవర్‌ బస్సును అక్కడే వదిలి పరారయ్యాడు. బైకు తుక్కుగా మారింది. దుర్ఘటన చూసి బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. గోకాక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మోస్ట్‌వాంటెడ్‌ అరెస్టు

బీజేపీ కార్యకర్త ప్రవీణ్‌ హత్య కేసు...

బనశంకరి: మంగళూరు వద్ద బీజేపీ కార్యకర్త ప్రవీణ్‌ నెట్టారు హత్యకేసులో ఎన్‌ఐఏ అధికారులు గురువారం కేరళ కొచ్చిలో తలదాచుకున్న మోస్ట్‌వాంటెడ్‌ ఎంఆర్‌ ఉమర్‌ ఫరూక్‌ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో పట్టుబడినవారి సంఖ్య 25 మందికి చేరుకుంది. హత్య జరిగిన నాటినుంచి ఫరూక్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం అరెస్టు వారంటు, రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేశారు. తలపై రూ.4 లక్షల బహుమతి ప్రకటించారు. హంతకులకు అన్ని విధాలా సాయం చేశాడు. పోలీసులు గాలించడంతో కేరళకు పారిపోయి తలదాచుకున్నాడు. గతనెల 11 తేదీన నౌషాద్‌, నసీర్‌ అనే ఇద్దరిని ఎన్‌ఐఏ అరెస్ట్‌చేసింది. వారిచ్చిన సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. సుళ్య తాలూకా బెళ్లారెలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్‌నెట్టారు (32).. 2022 జూలై 26 తేదీ రాత్రి అంగడి మూసి వెళ్తుంటే దుండగులు హత్య చేశారు.

రాజధానిలో 49.53 లక్షల ఓటర్లు డౌటే!

శివాజీనగర: గ్రేటర్‌ బెంగళూరు పరిధిలో గైర్హాజరు, శాశ్వత స్థానభ్రంశం, మరణం, పునరావృతం, ఇతర కారణాల వల్ల మొత్తం 49,53,020 (47.68 శాతం) మంది ఓటర్లు డోలాయమానంలో పడ్డారు. వారిని ఏఎస్‌డీడీఓ కేటరిగీలో చేర్చారని ఎన్నికల ప్రత్యేక కమిషనర్‌ సుష్మా గాడ్బోలే తెలిపారు. జీబీఏ గుర్తించిన 49,53,020 మంది ఓటర్లలో, 7,98,416 మంది వారి ఇళ్లలో లేరు. 33,84,790 మంది శాశ్వతంగా స్థానభ్రంశం అయ్యారు. 3,15,175 మంది మరణించారు, 60,005 మంది డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారు. మిగిలిన 3,94,634 మంది ఓటర్లు ఇతరత్రా అంశాలకు చెందినవారు. జీబీఏ వెబ్‌సైట్‌లో వివరాలు ప్రచురించినట్లు, ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించవచ్చని తెలిపారు. ఎన్యుమరేషన్‌ ఫారాలను వెంటనే ఇచ్చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement