మందు, చిందు.. 9 మంది ఉద్యోగుల సస్పెండ్‌ | - | Sakshi
Sakshi News home page

మందు, చిందు.. 9 మంది ఉద్యోగుల సస్పెండ్‌

Jul 30 2026 12:21 AM | Updated on Jul 30 2026 12:21 AM

దొడ్డబళ్లాపురం: డ్యూటీ సమయంలో ఆఫీసులకు రాకుండా మద్యం, మాంసంతో పార్టీ చేసుకున్న మొత్తం 9 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌ అయ్యారు. గత శుక్రవారం బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలో పనిచేసే 9 మంది డ్యూటీకి రాకుండా సిద్ధరబెట్ట పైన విందు విలాసాల్లో మునిగి తేలారు. కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ద్వారా పీడీఓల నిర్లక్ష్యం వైరల్‌గా మారింది. గ్రామీణాభివృద్ధి, పంచాయత్‌రాజ్‌ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రె దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో సస్పెన్షన్‌ వేటు వేశారు. గిరీష్‌, హరీష్‌, ప్రశాంత్‌, చిరంజీవి, రవిశంకర్‌, దినేష్‌ అనే పీడీఓలు, కార్యదర్శులు కెంపరంగయ్య, గంగాధర్‌, మంజునాథ్‌(ఎస్‌డీఏ)లపై వేటు పడింది.

రాహుల్‌ని దూషణ..

బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

శివాజీనగర: ఢిల్లీ కాక్రోచ్‌ పార్టీ నిరసనలకు వ్యతిరేకంగా మంగళవారం ఉడుపిలో బీజేపీ నిర్వహించిన ఆందోళనలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్‌ సువర్ణ విద్వేష పూరిత ప్రసంగం చేశారని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్‌ నేతలు ఆయనపై ఫిర్యాదు చేశారు. తమ నేత రాహుల్‌గాంధీపై అత్యంత అవమానకరమైన పదజాలం ఉపయోగించారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, దర్యాప్తు జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హరిరామ్‌ శంకర్‌ తెలిపారు. ఎమ్మెల్యే యశ్‌పాల్‌ సువర్ణకు వ్యతిరేకంగా బెంగళూరులో కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. దిష్టిబొమ్మను ధ్వంసం చేశారు. అటువంటి ప్రకటనలను సహించబోమని అన్నారు.

డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం

మండ్య: మాదకద్రవ్యాల అక్రమ తరలింపులో కొందరు యువకులు, విద్యార్థులు పాల్పంచుకోవడం సమాజానికి పెనుప్రమాదమని, డ్రగ్స్‌ను పూర్తిగా నాశనం చేయాలని ఎస్పీ శోభారాణి తెలిపారు. శ్రీరంగపట్టణలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ వ్యసనం నుంచి విముక్తి కోసం చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. చిత్రనటుడు దీపక్‌ పాల్గొన్నారు. దీపక్‌ మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్‌ వినియోగం, స్నేహాలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి చేతులు జోడించాలని కోరారు.

సీఎం పీఏనంటూ మోసాలు

శివమొగ్గ: తాను ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వ్యక్తిగత సహాయకుడు (పీఏ)ని అని అబద్ధం చెప్పి రిక్రియేషన్‌ క్లబ్‌ లైసెన్స్‌ ఇప్పిస్తానని నమ్మించి రూ.15 లక్షలు కొట్టేసిన వ్యక్తిని తుంగానగర పోలీసులు పట్టుకున్నారు. శివమొగ్గలోని కేహెచ్‌బీ కాలనీ నివాసి, రైతు మంజునాథ్‌ హంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు హేమంత్‌ కుమార్‌ అలియాస్‌ గణేష్‌ను అరెస్టు చేశారు. ఎన్నాళ్లయినా లైసెన్స్‌ ఇప్పించకుండా తప్పించుకు తిరగడంతో ఫిర్యాదు చేశారు. ఇతడు పెద్ద పెద్ద నాయకులు తెలుసని మోసాలకు పాల్పడుతూ ఉంటాడని సమాచారం.

ఐపీఎస్‌ లేఔట్‌లో రేవ్‌ పార్టీ

భగ్నం చేసిన పోలీసులు

బనశంకరి: బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ 6 వ సెక్టార్‌లోని ఐపీఎస్‌ లేఔట్‌ సర్వీస్‌ విల్లాలో నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీని పోలీసులు అడ్డుకుని నలుగురిని అరెస్ట్‌చేశారు. ఆ విల్లాను రోజుకు రూ.20 వేలకు అద్దెకు తీసుకున్న నిర్వాహకులు అమిగోస్‌ అనే యాప్‌ ద్వారా రేవ్‌ పార్టీకి యువతీ యువకులను ఆహ్వానించేవారు. యువకుల నుంచి రూ.1,099, అమ్మాయిల నుంచి రూ.499 ఫీజు వసూలు చేసేవారు. రాత్రంతా మద్యం, మ్యూజిక్‌తో మజా చేసేవారు. హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో ఎక్కువమంది ఐపీఎస్‌ల నివాసాలు ఉన్నాయి. ఇక్కడైతే పోలీసులు రైడ్‌ చేయరని నిర్వాహకులు భావించారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి హుక్కాలు, ఈ–సిగరెట్లు, భారీగా మద్యం సీజ్‌ చేశారు. పార్టీలో 12 మంది యువతులు, 17 మంది యువకులు ఉన్నారు. నిర్వాహకులు దీక్షత్‌, వేదాంత్‌ పండిత్‌, వరుణ్‌, శంకర్‌ను అరెస్ట్‌ చేశారు. విల్లా యజమానిపై కేసు నమోదైంది.

సస్పెండ్‌ అయిన 6మంది పీడీఓలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement