రాయచూరులో ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేసిన దృశ్యం
గురు వందన నిర్వహిస్తున్న శాంతమల్ల శివాచార్య, భక్తులు
రాయచూరులో పూజలు అందుకుంటున్న షిర్డి సాయిబాబా
సాక్షి బళ్లారి: పరమ పవిత్రమైన గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా నగరంలోని శ్రీషిర్డిసాయిబాబా, శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని ప్రధానంగా అనంతపురం రోడ్డులోని విశాల్ నగర్‌లో శ్రీషిర్డీ సాయిబాబా ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చి షిర్డీ సాయిబాబాను దర్శించుకొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ నామాల కుమారస్వామి ఆధ్వర్యంలో శ్రీషిర్డీసాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులను క్యూలో పంపి స్వామి వారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు చిన్నారులు, వృద్ధులతో సహా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో, గురునామ స్మరణతో మారుమోగింది. పటేల్ నగర్‌లో వివిధ పత్రికలకు ఏజెంటుగా పని చేస్తున్న దివాకర్ స్వగృహం వద్ద వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కోటె ప్రాంతంలో వెలసిన శ్రీషిర్డీసాయిబాబా ఆలయంలో కూడా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యనారాయణ పేటలో వెలసిన శ్రీగురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఆచరించుకొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లోని సాయి బాబా ధ్యాన మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలను సాయిబాబా ధ్యాన మందిరం ట్రస్టీ కిరణ్ ఆదోని జరిపారు. కాకడ హారతి, మహారుద్రాభిషేకం, పుష్పాభిషేకం, సాయి సత్య నారాయణ పూజలు, పల్లకీ సేవలు ధూప హారతి, అన్నదాసోహ కార్యక్రమాలు జరిపారు. రాజేష్ మడివాళ, ప్రవీణ్ ప్రభ శెట్టర్, కేశవమూర్తి, ఈరన్న, అన్వర్ పాషా, తానాజీలున్నారు. గురువందన ఉత్సవాల సందర్భంగా నగరంలోని గురుపీఠానికి కిల్లె బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అభిషేకం, పాదుకాపట్ట, జలాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. తాలూకాలోని మిట్టి మల్కాపూర్ సిద్దారూడ మఠంలో గురు పౌర్ణిమ ఉత్సవాల్లో గురువులను ఆరాధించి, పూజలు చేశారు.
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
హొసపేటె: గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని హొసపేటె నగరంలో సాయినాథుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సాయి శరణం.. బాబా శరణం.. శరణం అంటూ నామ సంకీర్తనలతో సాయినాథుని ఆలయాలన్నీ మార్మోగాయి. డ్యాం రోడ్డులో ఉన్న సాయిబాబా మందిరం, రైల్వే స్టేషన్ రహదారి, హంపీ రోడ్డు కొండనాయకనహళ్లిలో వెలసిన సాయి మందిరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేకువ జాము నుంచే సాయినాథుని ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు సాయిబాబా దర్శనం కోసం పెద్ద ఎత్తున క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
చెళ్లకెరెలో..
చెళ్లకెరె రూరల్: నగరంలోని పావగడ రోడ్డులో వెలసిన వెంకట సాయి షిర్డీ సాయి బాబా మందిరంలో బుధవారం గురుపౌర్ణమి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయం నుంచి అనేక మంది భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి సాయి బాబా దర్శనం చేసుకొని విశేష పూజలు జరిపారు. సాయి బాబా విగ్రహానికి వివిధ రకాల పండ్లు, పూలతో అలంకరించి విశేష పూజలు జరిపారు. మందిరంలో సత్యనారాయణ స్వామి పూజ, భజనలు, భక్తి గీతాలాపన వంటి ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి సాయి బాబా దర్శనం చేసుకున్నారు. ట్రస్ట్ వారు మందిరానికి విచ్చేసిన భక్తులకు ఉచిత ఆరోగ్య శిబిరం, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. చిత్రదుర్గ జిల్లాతో పాటు పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుంచి కూడా అపార సంఖ్యలో భక్తులు విచ్చేసి సాయిబాబాను దర్శించుకున్నారు.
షిర్డీ సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ఆలయాల వద్ద భక్తులకు
అన్నదాన, ఆరోగ్య పరీక్ష శిబిరాలు
ఆలయంలో అన్నసంతర్పణ
బళ్లారిఅర్బన్: దానాల్లో అత్యంత శ్రేష్టమైనది అన్నదానమని కురుగోడు మాజీ ఎమ్మెల్యే ఎన్.సూర్యనారాయణరెడ్డి అన్నారు. కురుగోడు పట్టణంలోని 22వ వార్డు బాదనహట్టి రోడ్డులోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా శ్రీసాయిరాం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత మూడేళ్లుగా గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ చేస్తున్న ట్రస్ట్ అధ్యక్షుడు, పదాధికారులు, ఆలయ అభివృద్ధికి స్థానికులతో పాటు పరిసర గ్రామాల భక్తులు కూడా సహకరించాలని కోరారు. అంతకు ముందు సూర్యనారాయణరెడ్డి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని అన్నసంతర్పణలో పాల్గొన్నారు.


