● ఇద్దరు మహిళా నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: దుర్గాదేవి మహిళా గ్రామీణాభివృద్ధి సంస్థ పేరు మీద అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికి చీటీల పేరుతో రూ.43.40 లక్షలు టోకరా వేసిన ఘటన బాగల్‌కోటె జిల్లాలో చోటు చేసుకుంది. ప్రజలను మోసం చేసిన ఈ కేసులో ఇద్దరు మిహిళా నిందితులను అరెస్ట్ చేశామని బాగలకోటె జిల్లా ఎస్పీ వెల్లడించారు. బుధవారం బీళిగి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లా డారు. అశోక్‌నగర్‌కు చెందిన అక్షిత(25), రజని(26)లను అరెస్ట్ చేసి సంస్థలో ఉన్న దాఖలాలు, ఆడిట్ రిపోర్టు, ఇతర రికార్డులను స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
న్యాయం చేయండి
బళ్లారి అర్బన్: సండూరు తాలూకా అయ్యనహళ్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 20/2లో ఉన్న 8.75 ఎకరాల వ్యవసాయ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసినప్పటికీ, తమను భూమిలోకి వెళ్లనివ్వకుండా సాగు పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని కుడితిని గ్రామానికి చెందిన డి.రామారావు, రాజశేఖర్ తెలిపారు. బుధవారం బళ్లారి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ప్రెస్ భవన్‌లో మాట్లాడారు. చిక్కమ్మ నుంచి సుమారు 15 సంవత్సరాల క్రితం రిజిస్టర్డ్ అమ్మకపు ఒప్పందం ద్వారా కొన్నామని, ఇప్పుడు భూమిలోకి రావద్దంటూ కొందరు అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు. లింగదహళ్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎలాంటి పత్రాలు చూపకుండా తమను అడ్డుకుని దుర్భాషలాడి, బెదిరించి, తమపై దాడికి ప్రయత్నించారని తెలిపారు.
ఆల్మట్టి డ్యాం నుంచి
చెరువులకు నీరు వదలాలి
హుబ్లీ: విజయపుర, బాగలకోటె జిల్లాల్లో ప్రజలకు, పశుపక్షాదులకు తాగునీటి పరిష్కారానికి ఆల్మట్టి డ్యాం నుంచి కాలువలకు నీటి విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని బసవన బాగేవాడి ఎమ్మెల్యే, మాజీ మంత్రి శివానంద పాటిల్ ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఆల్మట్టి డ్యాం ఖరీఫ్‌లో నిండక పోయినా రబీ సీజన్‌లో నిండే విశ్వాసం ఉంది. డ్యాం ఖరీఫ్ సీజన్‌లో నిండిన కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం డ్యాం నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తే భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడుతుందన్న ఆందోళన అవసరం లేదని ఆ విజ్ఞప్తిలో పేర్కొన్నారు. డ్యాంలో ప్రస్తుతం వాడాల్సిన నీటి ప్రమాణం 70 టీఎంసీ అడుగుల ఉంది. డ్యాం భర్తీ కావడానికి 35 టీఎంసీల అవసరం ఉంది. ఖరీఫ్ సీజన్ ఇంకా ముగియలేదు. ఇంకా డ్యాం నిండే నమ్మకం ఉందన్నారు. ఈ రెండు జిల్లాల్లో వర్షాలు రాక పలు చోట్ల తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటిపారుదల సలహా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించి నీటి విడుదల నిర్ణయం తీసుకోవడం వరకు వేచి చూడాల్సిన సమయం ఇది కాదన్నారు. పరిస్థితి తీవ్రతను గమనించి తక్షణమే డ్యాం నుంచి కాలువలకు నీటి విడుదల చేయాలని అధికారులకు సూచనలు ఇవ్వాలని సీఎంకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
మత్తు పదార్థాలకు
బానిస కావద్దు
హొసపేటె: విజయనగర జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఇండిపెండెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక పోతే, ఏదో ఒక రోజు మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుందన్నారు. మత్తు రహిత సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమన్నారు.
ఆస్కార్ స్థాయిలో సీఎం నటన
● నిఖిల్ కుమారస్వామి విమర్శ
హుబ్లీ: బిడది టౌన్‌షిప్ విషయంలో రాజకీయ ఎత్తుగడలు జోరందుకున్నాయని, స్క్రిప్ట్‌తో సీఎం డీకే.శివకుమార్ ఆస్కార్ స్థాయిలో నటించారని జేడీఎస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి విమర్శించారు. బాగలకోటె జిల్లా బాదామి తాలూకా కెందూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే.శివకుమార్ కొత్త చిత్ర కథ రాసుకొని ఆస్కార్ స్థాయిలో అభినయించి ఆకట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఓ వైపు జేడీఎస్ తరఫున నోటిఫికేషన్ రివ్యూ కమిటీ వేస్తామంటున్నారు. మరో వైపు నేడు మూడు గ్రామాల తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. దీన్ని బట్టే సీఎం మనస్థితి, ద్వంద్వ వైఖరి తెలుస్తుంది అని అన్నారు. దీనికి నాటక మండలి అధ్యక్షుడుగా సీఎం ఉండాలని దెప్పిపొడిచారు. కుమారస్వామి ఫిల్మినరీ నోటిఫికేషన్ వెల్లడించలేదు. రెడ్ జోన్ కూడా చేయలేదు. జస్ట్ మాస్టర్ ప్లాన్ వేశారు. అంతే.. దీన్నే కుమారస్వామి కలల మానస పుత్రిక అని పేర్కొని, ప్రస్తుతం మీరే దాన్ని తలపై పెట్టుకొని తిరుగుతున్నారని సీఎంను ఉద్దేశించి అన్నారు.


