రాయచూరు రూరల్: ప్రజల కష్టాలపై స్పందించడమే సంకల్ప సమాగమమని ఆధ్యాత్మిక గురువు వినయ్ గురూజీ అభిప్రాయ పడ్డారు. మంగళవారం సాయంత్రం మాన్వి తాలూకా కవితాళలో కేఎస్‌ఎన్ జన కల్యాణ సమితి అనే సేవా సంస్థ ఏర్పాటు చేసిన సంకల్ప సమాగమ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత 25 ఏళ్ల నుంచి సిరవార, మాన్వి, రాయచూరు ప్రాంతాల్లో సమగ్ర నీటిపారుదల, ఆరోగ్య, విద్య రంగాలకు ప్రాముఖ్యతను కల్పించారన్నారు. మాజీ మంత్రి శివనగౌడ నాయక్ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాంలో 33 టీఎంసీల మేర పేరుకున్న పూడిక నేపథ్యంలో నవలి వద్ద సమాంతర జలాశయ నిర్మాణానికి సర్కార్ చిత్తశుద్ధిని చూపడం లేదన్నారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు విషయంలో మూడేళ్లుగా పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. తింథిణి వద్ద నూతనంగా జలాశయ నిర్మాణం చేపడితే లింగసూగూరు, శహాపుర, తింథిణి, రాయచూరు కింది భాగాలకు తాగు, సాగునీరు అందించడానికి అవకాశాలు అధికమవుతాయన్నారు. కార్యక్రమంలో మాదయ్య గురువిన్, బసవరాజ్ కళస, చెన్నమల్లికార్జున స్వామి, శివణ్ణ తాత, మాజీ ఎంపీ బీ.వీ.నాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పరాజ్ హవల్దార్, తిమ్మారెడ్డి, శరణ బసవ, మల్లికార్జునలున్నారు.


